ఉద్యోగం వదిలిన వెంటనే 75 శాతం PF తీసుకోవచ్చు, EPFO సందేహాలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఇప్పుడు ఉద్యోగం వదిలిన వెంటనే తమ ప్రావిడెంట్ ఫండ్ (PF)లోని 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి 12 నెలలపాటు నిరుద్యోగిగా ఉంటే.. మొత్తం నిధులను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి కూడా హక్కు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ వివరణ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన EPFO కొత్త నియమాలు ఉద్యోగులకు అనుకూలం కావు అనే విమర్శలకు ప్రతిస్పందనగా వచ్చింది. మంగళవారం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో..నిధుల తుది పరిష్కారం కోసం సమయాన్ని రెండు నెలల నుండి 12 నెలలకు పెంచినట్లు తెలిపిన వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి.కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఉపసంహరణ నియమాలు, అర్హత నిబంధనలు, సభ్యుల బ్యాలెన్స్‌లపై వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక నెల నిరుద్యోగం ఉన్న సభ్యుడు తన EPF బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండు నెలలు నిరుద్యోగిగా ఉంటే 100% మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో పెన్షన్ ఖాతాల విషయంలో మాత్రం కొత్త మార్పులు వర్తిస్తాయి. పెన్షన్ నిధుల ఉపసంహరణ 36 నెలల తర్వాత మాత్రమే అనుమతించబడుతుంది. కానీ ప్రస్తుతం రెండు నెలల నిరుద్యోగం తర్వాత తుది పెన్షన్ ఉపసంహరణలు సాధ్యమని స్పష్టం చేశారు.
55 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పదవీ విరమణ, శాశ్వత వైకల్యం, స్వచ్ఛంద పదవీ విరమణ, ఉద్యోగం వదిలివేయడం లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్ళడం వంటి సందర్భాల్లో మొత్తం పీఎఫ్ నిధులను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో తరచుగా ఉపసంహరణలు చేయడం వల్ల సర్వీస్ రికార్డులు భంగమయ్యాయి. దీని కారణంగా అనేక పెన్షన్ కేసులు తిరస్కరించబడ్డాయి. చివరికి ఉద్యోగులకు తక్కువ మొత్తమే మిగిలేది. కొత్త మార్గదర్శకాలు ఈ సమస్యలను నివారించడానికి ఉద్దేశించబడ్డాయని తెలిపింది.
మంగళవారం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పాక్షిక ఉపసంహరణల వర్గాలను ప్రస్తుత 13 నుండి కేవలం 3కి తగ్గించారు.
అవి:
1. ముఖ్య అవసరాలు(వైద్యం, విద్య, వివాహం)
2. గృహ అవసరాలు
3. ప్రత్యేక పరిస్థితులు
గతంలో 'ప్రత్యేక పరిస్థితులు' కింద ఉపసంహరణ చేయాలంటే కారణాలను స్పష్టంగా చెప్పాల్సి ఉండేది. ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు, లాకౌట్లు, నిరంతర నిరుద్యోగం మొదలైనవి. కానీ ఇప్పుడు సభ్యులు ఎటువంటి కారణం చెప్పకుండానే ఈ వర్గంలో పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నుంచి సభ్యులు విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు.ఇంతకుముందు, వివాహం, విద్య కోసం కలిపి గరిష్టంగా మూడు పాక్షిక ఉపసంహరణలు మాత్రమే అనుమతించబడ్డాయి. ఈ మార్పు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచి తీసుకున్నదని EPFO పేర్కొంది.
మంగళవారం జారీ చేసిన మార్గదర్శకాలు ఉపసంహరణ ప్రక్రియను సరళీకృతం చేస్తూ.. పదవీ విరమణ సమయంలో సభ్యులకు మంచి కార్పస్ అందించడమే లక్ష్యం. ఇది సభ్యుల అవసరాలు, భవిష్య భద్రత మధ్య సమతుల్యతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ మార్పులు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, దీర్ఘకాలిక పీఎఫ్ సేవింగ్స్ భద్రతను కూడా కాపాడేలా రూపొందించబడ్డాయి. ఉద్యోగం వదిలిన వెంటనే 75 శాతం ఉపసంహరణ అనుమతి అనేది.. నిరుద్యోగ సమయంలో ఆర్థిక ఒత్తిడి తగ్గించడంలో కీలకమైన నిర్ణయంగా ఉద్యోగులు స్వాగతిస్తున్నారు.


Click it and Unblock the Notifications