వడ్డీరేటుపై ఈపీఎఫ్ గుడ్‌న్యూస్, రెండు దఫాల్లో 8.5% వడ్డీ రేటు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సబ్‌స్క్రైబర్లకు వడ్డీరేటును ఖరారు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను వడ్డీని రెండు దఫాలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.5 శాతంగా చెల్లించాలని నిర్ణయించింది. దీంతో 6 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ వడ్డీని రెండు విడతలుగా చెల్లిస్తారు.
ఈపీఎఫ్ ఖాతాల్లోని నిధిపై 8.15 శాతం వడ్డీని ఇప్పుడు జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబర్ నెలలో జమ చేస్తారు. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని బుధవారం జరిగిన ఈపీఎఫ్‌ఓ ట్రస్టీల సమావేశంలో తీసుకున్నారు. తమ వద్దనున్న కొన్ని పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చాలని ఈపీఎఫ్ గతంలో యోచించింది. కానీ కరోనా నేపథ్యంలో మార్కెట్లు స్థిరంగా లేనందున ఈ ఆలోచనను విరమించుకుంది. ఇప్పటికే రూ.లక్ష కోట్ల విలువైన ఈటీఎఫ్ పెట్టుబడులపై నష్టాలు రావడం చందాదారుల చెల్లింపును దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. వార్షిక డిపాజిట్లలో ఈపీఎఫ్ఓ 85 శాతం రుణ సాధనాలలో, 15 శాతం ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతుంది.

ఈపీఎఫ్ఓ అత్యున్నతస్థాయి వ్యవస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం డిసెంబర్‌లో మరోసారి ఉంటుంది. ఈక్విటీ పెట్టుబడుల డైల్యూషన్ ద్వారా 0.35 శాతం వడ్డీని డిసెంబర్‌లో చెల్లించేలా నిర్ణయించారు. అలాగే కరోనా కాలంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద ఉన్న గరిష్ట హామీ ప్రయోజనాన్ని ప్రస్తుతం ఉన్న రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచింది. ఇదిలా ఉండగా కరోనా కాలంలో క్లెయిమ్స్ సంఖ్య పెరిగాయి. ఏప్రిల్ - ఆగస్ట్ కాలంలో రూ.35,445 కోట్ల విలువైన 94.41 లక్షల క్లెయిమ్స్ క్లియర్ చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం ఎక్కువ.


Click it and Unblock the Notifications