పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పాస్‌పోర్ట్ ఆఫీసుల తరహాలో EPFO కార్యాలయాలు
ప్రావిడెంట్ ఫండ్ (PF) కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా పీఎఫ్ సేవలను సులభతరం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు EPFO కార్యాలయాల పని విధానంలోనే పెద్ద మార్పులు తీసుకురానుంది. ఇకపై EPFO కార్యాలయాలు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (Passport Seva Kendra) తరహాలో పనిచేయనున్నాయి. దీని వల్ల పీఎఫ్ ఖాతాదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని కేంద్రం తెలిపింది.
ఈ విషయాన్ని EPFO కొత్త ప్రావిడెంట్ ఫండ్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న EPFO కార్యాలయాలను సింగిల్ విండో సర్వీస్ సెంటర్లుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ఈ విధానానికి సంబంధించిన ట్రయల్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైందని కూడా వెల్లడించారు.

ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాదారులు తమ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా తమ యజమాని అనుబంధిత ప్రాంతీయ EPFO కార్యాలయానికే వెళ్లాల్సి వచ్చేది. ఉదాహరణకు చెప్పాలంటే ఉద్యోగం మారినప్పుడు లేదా వేరే రాష్ట్రానికి మారినప్పుడు సమస్యలు మరింత పెరిగేవి. కొత్త విధానం అమలులోకి వస్తే, ఖాతాదారు దేశంలోని ఏ EPFO కార్యాలయానికైనా వెళ్లి తన సమస్యను పరిష్కరించుకోవచ్చు. అన్ని సేవలు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అనుసంధానమవుతాయి. దీంతో క్లెయిమ్‌లు, KYC ధృవీకరణ, ఖాతా బదిలీ వంటి ప్రక్రియలు వేగంగా పూర్తవుతాయి.
డిజిటల్ విధానంతో పని చేయడంలో ఇబ్బంది పడే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా EPF సర్వీస్ ప్రొవైడర్లను నియమించనుంది. వీరు పీఎఫ్ ఖాతాదారులకు మార్గనిర్దేశం చేస్తూ, క్లెయిమ్‌ల దాఖలు, KYC పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. ఇకపై ఏజెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, అధికారికంగా నియమిత సిబ్బంది ద్వారా సేవలు అందుతాయి. ఈ మార్పులతో విదేశాల్లో పనిచేసిన భారత ఉద్యోగులకు కూడా పెద్ద ప్రయోజనం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగ సమయంలో కట్ అయిన పీఎఫ్ డబ్బు ఇక కోల్పోయే ప్రమాదం ఉండదు. వారు భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత కూడా తమ పీఎఫ్ మొత్తాన్ని సులభంగా ఉపసంహరించుకోగలుగుతారు.
చాలా మంది ఉద్యోగుల పీఎఫ్ డబ్బు KYC సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో KYC ధృవీకరణ చేపట్టనుంది. అర్హులైన ఖాతాదారులను గుర్తించి, వారి డబ్బును వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే EPFOలో ఈ మార్పులు అమలులోకి వస్తే పీఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications