కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్, ఈసారి తక్కువ రిటర్న్స్!
ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫంట్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు షాకిచ్చే అవకాశాలు ఉన్నాయి. కోట్లాది మందికి వడ్డీ రేటు తగ్గవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో EPFO తమ సబ్‌స్క్రైబర్ల వడ్డీ రేటును 15 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కోట్లాది మంది శాలరైడ్ ఈపీఎఫ్ఓలో తప్పనిసరిగా జమ చేయాలి. వడ్డీ రేటు తగ్గిస్తే వీరి వడ్డీ రాబడిపై కొంత ప్రతికూల ప్రభావం పడుతుంది.

15 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించే ఛాన్స్
EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటును 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చునని తెలుస్తోంది. అదే జరిగితే మార్చి 31, 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి తక్కువ రాబడి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి EPFO 8.65 శాతం వడ్డీ రేటును ఇస్తోంది.

ఆర్థిక మందగమనం ఎఫెక్ట్
ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏడాది కాలంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. ఈ ప్రభావం భారత్‌లోను ఎక్కువే ఉంది. మందగమనం నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఆయా రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు, పీఎఫ్ కట్టింగ్‌లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మందగమన ప్రభావం పీఎఫ్ వడ్డీ రేటుపై కూడా పడింది.

రాబడి తగ్గడంతో..
ఆర్థిక మందగమనం, డెట్ మార్కెట్లో తక్కువ రాబడి, పీఎఫ్, గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఇతర స్కీంలపై తక్కువ వడ్డీ పలు అంశాల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ కూడా పీఎప్ ఖాతాపై వడ్డీ రేటును తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అదే జరిగితే 6 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు తక్కువ రాబడి వస్తుంది.

ఈ నెల చివరలో నిర్ణయం..
మార్కెట్లో వడ్డీ రేటు తగ్గుతున్న సమయంలో ఈఫీఎఫ్ఓలో 8.65 శాతం వడ్డీ రేటు అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల చివర వరకు వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం రావొచ్చునని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ఎక్కువ మొత్తాన్ని డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తోంది. 85 శాతం డెట్ మార్కెట్లో, 15 శాతం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది.

సాధారణమే..
మార్కెట్లో వడ్డీ రేట్లు 100 బేసిస్ పాయింట్లు పడిపోతే ఈపీఎఫ్ఓ చెల్లింపు 55 నుంచి 70 బేసిస్ పాయింట్ల వరకు ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈసారి వడ్డీ రేటు 8.65 శాతం ఇచ్చే అవకాశాలు లేదని అంటున్నారు. వడ్డీ రేటును 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం ఆశ్చర్యం ఏమీ కాదని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications