పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.. ఇకపై ఈ కొత్త ఫారం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..
EPF Withdrawal Rules Change: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ చందాదారులకు ఒక అత్యంత కీలకమైన, ప్రయోజనాకరమైన మార్పును తీసుకువచ్చింది. 2026-27 పన్ను సంవత్సరం నుండి పీఎఫ్ (EPF) ఉపసంహరణలపై మూలం వద్ద పన్ను మినహాయింపు (TDS) క్లెయిమ్ చేయడానికి ఇప్పటివరకు వాడుకలో ఉన్న ఫారం 15జీ (Form 15G), ఫారం 15హెచ్ (Form 15H) లు ఇకపై చెల్లవని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.
నూతనంగా అమలవుతున్న ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే సమయంలో టీడీఎస్ మినహాయింపును పొందడానికి చందాదారులు ఇకపై తప్పనిసరిగా ఫారం 121 (Form 121) ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని అధికారిక ప్రకటన వెలువడింది. సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా ఈపీఎఫ్‌ఓ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త విధానానికి అనుగుణంగా మారాలని సూచించింది.

కింగ్ స్టబ్ & కసివ అడ్వకేట్స్ & అటార్నీస్ భాగస్వామి అయిన ఆదిత్య భట్టాచార్య ఈ మార్పుపై వివరణ ఇస్తూ.. గతంలో నివాస పన్ను చెల్లింపుదారులు తమ వయస్సు, అర్హతను బట్టి ఫారం 15జీ (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, మొత్తం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నవారు) లేదా ఫారం 15హెచ్ (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు) ఫారమ్‌లను ఎంచుకునేవారని తెలిపారు. కానీ 2026-27 పన్ను సంవత్సరం నుంచి ఈ రెండు ఫారమ్‌ల రద్దుతో, పీఎఫ్ సభ్యులు ఈ పురాతన విధానానికి బదులు కొత్త ఫారం 121 నిబంధనను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఏమి మారింది? ఈ కొత్త ఫారం ప్రత్యేకత ఏమిటి?
ఈ మార్పు కేవలం ఒక విధానపరమైన సరళీకరణ మాత్రమేనని.. కొత్త పన్నులని ఏమీ ప్రవేశపెట్టలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, అర్హత కలిగిన నివాస పన్ను చెల్లింపుదారులు తమ ఆ సంవత్సరపు మొత్తం పన్ను బాధ్యత సున్నాగా ఉంటుందని భావిస్తే.. సెక్షన్ కింద ఏకీకృత ప్రకటనను సమర్పించడానికి ఈ ఫారం 121 అనుమతిస్తుంది. అయితే ఈ ఫారం సమర్పించినంత మాత్రాన పీఎఫ్ ఉపసంహరణ స్వయంచాలకంగా పూర్తిగా పన్ను రహితం అయిపోదని, ఇది కేవలం పన్ను పరిధిలోకి రాని అర్హత గల వ్యక్తులు టీడీఎస్ కోత నుండి మినహాయింపు కోరడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఆదిత్య భట్టాచార్య స్పష్టం చేశారు.
ఈ విధానం పూర్తిగా ఐచ్ఛికమైనది అయినప్పటికీ, సభ్యులు దీనిని సమర్పించే ముందు కొన్ని కీలక నిబంధనలను పాటించాలి:
1. పీఎఫ్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే పాన్ కార్డ్ (PAN Card) అనుసంధానించబడి ఉండటం తప్పనిసరి. పాన్ లేకుండా సమర్పించే ఏ డిక్లరేషన్ అయినా చెల్లదుగా పరిగణించబడుతుంది.
2. ఈ సదుపాయం నివాసితులు కాని వారికి లేదా వాస్తవంగా పన్ను చెల్లించాల్సిన వ్యక్తులకు వర్తించదు.
ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ వ్యవస్థ,ప్రత్యేక సంఖ్య
ఈ కొత్త విధానాన్ని మరింత పారదర్శకంగా.. కచ్చితంగా మార్చేందుకు ఈపీఎఫ్‌ఓ తన అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన ప్రతి ఫారం 121కి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number) జారీ చేయబడుతుంది. అలాగే డిజిటల్ లేదా ఇ-సంతకం (e-signature) ద్వారా ఆన్‌లైన్‌లోనే ఈ ఫారమ్‌ను సమర్పించే వెసులుబాటును కల్పించారు.
పీఎఫ్ ఖాతా నుంచి అత్యవసరంగా నిధులను ఉపసంహరించుకోవాలని యోచిస్తున్న సభ్యులు, పాత పద్ధతిలో టీడీఎస్ కట్ అయిన తర్వాత తిరిగి రీఫండ్ కోసం సుదీర్ఘకాలం వేచి ఉండే బదులు.. ఇకపై మొదటి నుండే ఈ నూతన 'ఫారం 121' నిబంధనను ఉపయోగించుకుని టీడీఎస్ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడం సులభతరమని పన్ను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సభ్యులు దరఖాస్తు చేసే ముందే తమ అర్హతలను, పాన్ వివరాలను సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.


Click it and Unblock the Notifications
