EPF vs PPF vs NPS: లాంగ్‌టర్మ్‌లో లాభాల కోసం ఏ పథకం మేలు? పూర్తి క్లారిటీ!
భవిష్యత్తు అవసరాల కోసం లేదా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. దీని కోసం మన దేశంలో మూడు ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి..- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) , నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఈ మూడు ప్రభుత్వ ఆధీనంలో నడిచే పెట్టుబడులు. అయితే వీటిలో దేని రిటర్న్స్ ఎలా ఉంటాయి? పన్ను ప్రయోజనాలు ఎందులో ఎక్కువ? అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)
ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగుల కోసం రూపొందించిన పథకం ఇది. ఇందులో ఉద్యోగి జీతం (Basic + DA) నుంచి 12 శాతం, అలాగే యాజమాన్యం నుంచి మరో 12 శాతం జమ అవుతుంది.
- వడ్డీ రేటు: ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది మిగిలిన సురక్షిత పథకాల కంటే మెరుగైనది.
- పన్ను ప్రయోజనం: ఇందులో మీరు పెట్టే పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ , మెచ్యూరిటీ మొత్తం అన్నీ పూర్తిగా పన్ను రహితం (EEE కేటగిరీ).
- ఎవరికి మేలు?: రిస్క్ లేకుండా స్థిరమైన, గ్యారెంటీ రిటర్న్స్ కోరుకునే ఉద్యోగులకు EPF బెస్ట్ ఛాయిస్.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
ఇది ఎవరైనా (ఉద్యోగులు లేదా స్వయం ఉపాధి పొందే వారు) అప్లై చేసుకోగలిగే సురక్షితమైన పొదుపు పథకం.
- కాలపరిమితి: దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. అవసరమైతే మరో 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.
- వడ్డీ రేటు: ప్రస్తుతం ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం ఈ రేట్లను సమీక్షిస్తుంది.
- పన్ను ప్రయోజనం: సెక్షన్ 80సి కింద మినహాయింపు లభిస్తుంది. అలాగే దీనిపై వచ్చే వడ్డీకి కూడా ఇన్కమ్ టాక్స్ ఉండదు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
ఇది మార్కెట్ ఆధారిత పథకం. అంటే మీరు పెట్టే డబ్బు ఈక్విటీ (షేర్ మార్కెట్) , డెట్ ఫండ్స్ లో పెట్టుబడిగా మారుతుంది.
- రిటర్న్స్: మార్కెట్ పనితీరును బట్టి 10 నుండి 12 శాతం వరకు లేదా అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది.
- మెచ్యూరిటీ: 60 ఏళ్ల వయస్సులో మీరు జమ చేసిన మొత్తంలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) కొనాల్సి ఉంటుంది.
- అదనపు టాక్స్ బెనిఫిట్: సెక్షన్ 80CCD(1B) కింద అదనంగా రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఏది ఎంచుకోవాలి?
మీరు కచ్చితమైన గ్యారెంటీ రిటర్న్స్ కోరుకుంటే EPF , PPF ఉత్తమం. కానీ, మీరు కాస్త రిస్క్ తీసుకుని ఎక్కువ కార్పస్ (పెద్ద మొత్తం) జమ చేయాలనుకుంటే NPS వైపు మొగ్గు చూపవచ్చు. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ గా మీ పోర్ట్‌ఫోలియోలో ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయడం వల్ల పన్ను ఆదా అవ్వడమే కాకుండా రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
ఈ పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి.. మీ ఆదాయానికి, లక్ష్యాలకు తగ్గట్టుగా అడుగు వేయడం ఉత్తమం.


Click it and Unblock the Notifications