పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గిఫ్ట్: ఈ నెలలోనే అకౌంట్లలోకి 8.25% వడ్డీ డబ్బులు!
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి (FY26) గానూ EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ వడ్డీ డబ్బులు ఈ నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 7 కోట్లకు పైగా ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి.

ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్!
సాధారణంగా ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) వడ్డీ రేటును ప్రతిపాదించిన తర్వాత, దానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలోని సీబీటీ.. గత మార్చి 2, 2026 నాడే ఈ వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. తాజాగా ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, కార్మిక శాఖ ఆదేశాల ప్రకారం ఈ నెలలోనే లబ్ధిదారుల అకౌంట్లలో వడ్డీ సొమ్మును డిపాజిట్ చేయడానికి ఈపీఎఫ్ఓ రంగం సిద్ధం చేసింది.
కొత్త ఎకోసిస్టమ్‌తో ఇన్స్టంట్‌గా డబ్బులు జమ!
గతంలో పీఎఫ్ వడ్డీ అకౌంట్లలో పడటానికి చాలా నెలల సమయం పట్టేది. కానీ, ఇప్పుడు EPF డెవలప్ చేసిన సరికొత్త డిజిటల్ సిస్టమ్ ద్వారా.. కేంద్రం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే చాలా వేగంగా, నేరుగా కస్టమర్ల అకౌంట్లలో వడ్డీ డబ్బులు క్రెడిట్ అయిపోతాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
వరుసగా మూడో ఏడాది అదే వడ్డీ రేటు
కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా పీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతం వద్దే స్థిరంగా కొనసాగించింది. ఒకప్పుడు అంటే 2021-22 లో పీఎఫ్ వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ట స్థాయి అయిన 8.10 శాతానికి తగ్గించారు. ఆ తర్వాత 2022-23లో దానిని 8.15 శాతానికి, ఆ మరుసటి ఏడాది 8.25 శాతానికి పెంచారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇతర సేవింగ్స్ స్కీమ్స్‌తో పోలిస్తే 8.25 శాతం వడ్డీ రేటు అనేది ఉద్యోగులకు చాలా లాభదాయకమైన విషయమనే చెప్పాలి.
ఈపీఎఫ్ వడ్డీ రేట్ల చరిత్ర (EPFO Interest Rate History)
గడిచిన కొన్ని ఏళ్లలో పీఎఫ్ వడ్డీ రేట్లు ఎలా మారుతూ వచ్చాయో ఒకసారి పరిశీలిస్తే.. 1977-78 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.00 శాతంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఇది మారుతూ వచ్చి, 2011-12లో 8.25 శాతానికి చేరింది. తదనంతరం 2012-13లో 8.50 శాతానికి పెరగ్గా, 2013-14 , 2014-15 సంవత్సరాల్లో 8.75 శాతంగా స్థిరంగా కొనసాగింది. 2015-16లో మరింత పెరిగి 8.80 శాతానికి చేరుకుంది.
ఆ తర్వాతి సంవత్సరాల్లో క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2016-17లో 8.65 శాతానికి, 2017-18లో 8.55 శాతానికి పడిపోయింది. అయితే 2018-19లో మళ్లీ స్వల్పంగా పెరిగి 8.65 శాతానికి చేరినప్పటికీ, 2019-20 నాటికి తిరిగి 8.50 శాతానికి తగ్గింది. కోవిడ్ మహమ్మారి సమయం , ఆ తర్వాత 2020-21, 2021-22 సంవత్సరాల్లో పీఎఫ్ వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి అయిన 8.10 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటూ 2022-23లో 8.15 శాతానికి, 2023-24లో 8.25 శాతానికి పెరిగింది. ఇప్పుడు ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా అదే 8.25 శాతం వడ్డీ రేటును కేంద్రం కొనసాగిస్తోంది.
ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదం వచ్చేసింది కాబట్టి, పీఎఫ్ ఖాతాదారులు ఈ నెలాఖరు కల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా గానీ, ఉమాంగ్ (UMANG) యాప్ లేదా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి గానీ పాస్‌బుక్ చెక్ చేసుకుంటే పెరిగిన వడ్డీ బ్యాలెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది!


Click it and Unblock the Notifications