జీతభత్యాలపై ఫౌండిట్ నివేదిక.. ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు ఈ ఏడాది..
అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల దేశీయ ఉద్యోగులూ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఒకపక్క పలు కంపెనీలు లేఆఫ్స్ ఇచ్చి సిబ్బందిని ఇంటికి పంపుతున్నాయి. మరికొన్ని హైక్స్ ఇవ్వడాన్ని నిలిపివేశాయి. జీతభత్యాల విషయంలో ఆయా కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై 'ఫౌండిట్' ఓ నివేదిక విడుదల చేసింది.
దేశంలోని 60 శాతం మంది ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపు లభించలేదని ప్రముఖ జాబ్ అగ్రిగేటర్ ప్లాట్ ఫాం ఫౌండిట్ పేర్కొంది. 3 ఏళ్ల లోపు అనుభవం ఉన్న సిబ్బంది తమకు ఎటువంటి హైక్ అందలేదని చెప్పినట్లు సర్వేలో తెలిపింది. 62 శాతం మంది జీతం పెరగలేదని తెలపగా.. 10 శాతం మందికి 10 శాతం లోపు, 9 శాతం మందికి 5 శాతం లోపు మాత్రమే హైక్ వచ్చినట్లు వెల్లడించారట.

వేతనాల పెంపుకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు ఆయా కంపెనీలు చూస్తున్నట్లు foundit CEO శేఖర్ గరిసా తెలిపారు. ESOP, బోనస్, ప్రమోషన్స్ సహా ఇతరత్రా పద్ధతుల్లో సిబ్బందికి కాంపెన్సేట్ చేసేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించారు. హైక్ పొందని 49 శాతం మంది ఉద్యోగులు ESOPలు, బోనస్‌ల ద్వారా మరియు 20 శాతం మంది ప్రమోషన్స్ ద్వారా లబ్ధి పొందినట్లు ఫౌండిట్ అప్రైజల్ ట్రెండ్స్ రిపోర్టు పేర్కొంది.
హెల్త్ కేర్, BPO/ITESలోని ఉద్యోగులు ఎక్కువ మంది ఈ ఏడాది వేతన పెంపు పొందినట్లు నివేదిక తెలిపింది. BFSI, IT, ఇంజనీరింగ్/కన్స్ట్రక్షన్ రంగాల సిబ్బంది 30 శాతం మందికి మాత్రమే 15 శాతం లోపు హైక్ అందినట్లు చెప్పింది. 38 శాతం మంది అంచనాల మేరకు ఇంక్రిమెంట్ పొందామని, 52 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అప్రైజల్ సబబేనని భావిస్తున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications