Trending: అమెరికాలో ఉండాలంటే అందంగా ఉండాల్సిందేనా? సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న వైరల్ పోస్ట్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా ట్రెండింగ్ (trending) అవుతోంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు సంబంధించి 'జెన్‌రైట్' (GenRAIT) అనే డీప్ టెక్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాజీబ్ ఖాన్ చేసిన 23 సూచనలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

బాడీ షేమింగ్ నుంచి అసిమిలేషన్ వరకు..
రాజీబ్ ఖాన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న ఈ థ్రెడ్ లో ప్రధానంగా భారతీయుల లైఫ్ స్టైల్, అమెరికన్ సంస్కృతిలో వారు కలిసిపోయే విధానం గురించి మాట్లాడారు. ముఖ్యంగా పాయింట్ నంబర్ 5లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మధ్య తరగతి భారతీయుల్లో ఎక్కువగా కనిపించే 'స్కిన్నీ- ఫ్యాట్' (చూడటానికి సన్నగా ఉన్నా పొట్ట ఉండటం) బాడీ టైప్‌ను మార్చుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం 'GLP-1' వంటి మందులు వాడాలని లేదా హై ప్రొటీన్ డైట్ తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. "ప్రజలు బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తారు.. సారీ" అంటూ ఆయన రాసుకొచ్చారు.
సంస్కృతిలో కలిసిపోవడం ముఖ్యం
భారతీయులు అమెరికాకు వచ్చినప్పుడు అక్కడి స్థానిక నిబంధనలకు అనుగుణంగా మారాలని ఆయన సూచించారు. "ఇది ఒక భయంకరమైన, అణచివేసే దేశం అని ఇక్కడి ఎలైట్ వర్గం చెబుతుంది.. అది అబద్ధం. మీరు ఈ దేశాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు.. ఆ విషయాన్ని మర్చిపోవద్దు" అని పాయింట్ 9 లో పేర్కొన్నారు. భారతీయులు తమ కమ్యూనిటీలకే పరిమితం కాకుండా, స్థానికులతో మమేకం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ఈ పోస్ట్ దాదాపు 1.70 లక్షల వ్యూస్ సాధించి ఇంటర్నెట్ లో ట్రెండింగ్ (trending) అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
- మద్దతుదారులు: రాజీబ్ ఖాన్ చెప్పింది వాస్తవమని, కొత్తగా అమెరికా వచ్చే వారు అక్కడి పద్ధతులను గౌరవించాలని కొందరు అంటున్నారు. 1979 లో అమెరికాలో పుట్టిన ఒక వ్యక్తి స్పందిస్తూ.. "మా తల్లిదండ్రులు ఇక్కడి సంస్కృతిలో కలిసిపోయారు, కొత్తగా వస్తున్న వారు కూడా అదే చేయాలి" అని మద్దతు తెలిపారు.
- వ్యతిరేకించేవారు: "నీ సలహాలు మాకు అవసరం లేదు" అంటూ చాలా మంది ఘాటుగా స్పందిస్తున్నారు. శారీరక ఆకృతిపై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, ఇదంతా కేవలం ఎంగేజ్‌మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నమని కొందరు విమర్శిస్తున్నారు.
ఒకరి సలహా.. అందరి చర్చ
ప్రస్తుతం అమెరికాలో ఇండియన్ డయాస్పోరా చాలా బలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఒక భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్తే ఇన్ని సూచనలు చేయడం సహజంగానే చర్చకు దారితీసింది. ఎవరైనా సరే ఒక కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులకు మారాలా లేదా తమ సొంత గుర్తింపును అలాగే ఉంచుకోవాలా అనే పాత చర్చను ఈ పోస్ట్ మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ కేక్ లా ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications