L&T Metro: హైదరాబాద్ ప్రయాణ కష్టాలు తీర్చటంలో మెట్రో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలంగా సేవల్లో ఉన్న మెట్రో ప్రస్తుతం నష్టాలను చవిచూస్తోంది.
వివరాల్లోకి వెళితే తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మహిళలకు డిసెంబర్ 9, 2023న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ మెట్రోకు పెద్ద నష్టం వాటిల్లుతోంది. ప్రయాణికుల సంఖ్య తగ్గటంతో ప్రమోటర్ L&T ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. మెట్రో ప్రాజెక్ట్ ఆర్థిక పరిస్థితి ఎల్ అండ్ టీకి ఆందోళన కలిగిస్తున్న అంశంగా ఉంది. ఇది 2021 నుంచి తన పుస్తకాల్లో హైదరాబాద్ మెట్రోని నాన్-కోర్ అసెట్‌గా జాబితా చేసింది. నవంబర్ 2023లో హైదరాబాద్ మెట్రో రైడర్‌షిప్ రోజుకు 5.5 లక్షల నుంచి 4.6 లక్షలకు పడిపోయింది.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఆచరణీయంగా ఉండాలంటే మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజుకు 5 లక్షల కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే కంపెనీ అప్పు రూ.12,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్లకు తగ్గాలి. L&T 2010లో ఈ ప్రాజెక్ట్‌ను పొందింది. ఆలస్యం కారణంగా దీని అంచనా వ్యయం రూ.14,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ప్రయాణికుల సంఖ్యపై భారీగానే ప్రభావం చూపిందని కంపెనీ చెబుతోంది. ఈ క్రమంలో 2026 తర్వాత ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించడాన్ని కంపెనీ పరిశీలిస్తోంది.
హైదరాబాద్ మెట్రోలో ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీకి 90% వాటా ఉండగా, తెలంగాణ ప్రభుత్వానికి మిగిలిన 10% వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వ చర్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సహాయం చేయదని ఎల్ అండ్ టీ సీఎఫ్‌వో శంకర్ రామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పురుషులు మాత్రమే ఎక్కువగా మెట్రోను వినియోగిస్తున్నారని అన్నారు. వీటికి తోడు రైడ్ హెయిలింగ్ కంపెనీల సేవలు విస్తృతం కావటంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోందని అన్నారు. అలాగే మెట్రో ఎక్కుతున్న పురుషులు సగటున రూ.35 చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటంతో ఎల్ అండ్ టి మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకోవటంపై దృష్టి కేంద్రీకరించింది.


Click it and Unblock the Notifications