దేశంలో లోన్ యాప్ అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారు పెడుతున్న వేధింపులకు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు రోజూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. వీటిని రిజర్వు బ్యాంక్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు 100 ఫిన్‌టెక్ సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో కార్యకలాపాలను నిలిపివేసింది. వాటిలో కొన్నింటిని మూసివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్
రెండు వారాల క్రితం.. ED హైదరాబాద్ చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకులకు ఈ కంపెనీల జాబితాను పంపింది. సుమారు 100 ఫిన్‌టెక్ సంస్థల ఖాతాలను స్తంభింపజేయమని వారిని కోరింది. ED చర్యను ఎదుర్కొంటున్న సంస్థలకు పంపిన ఈ-మెయిల్ ప్రకారం.. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు, గరిష్ఠంగా 60 రోజుల వరకు లోన్ యాప్ సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేయబడతాయి.

వ్యవస్థాపకులకు ప్రశ్నల వర్షం
ED చర్యను ఎదుర్కొంటున్న స్టార్టప్‌లలో Pagarbook, Propeld, Progcap, Kredily, Pocketly, Krazybee సంస్థలు కూడా ఉన్నాయి. ఈ ఫిన్‌టెక్ కంపెనీల వ్యవస్థాపకులను కూడా ఏజెన్సీ ఇప్పటికే విచారణకు పిలిపించింది. కంపెనీల నికర విలువ, పెట్టుబడిదారులు, వారి నిధుల సేకరణ గురించి అధికారులు సుమారు 50 వరకు ప్రశ్నలు అడిగినట్లు ED సమన్‌ను స్వీకరించిన ఒక ఫిన్‌టెక్ వ్యవస్థాపకుడు తెలిపాడు.

చైనా పెట్టుబడులపై ఆరా
సదరు ఫిన్ టెక్ కంపెనీలు చైనీస్ డబ్బును అప్పుగా ఇస్తున్నాయా, వారికి ఏదైనా చైనీస్ కనెక్షన్లు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులు విస్తృతంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించాయన్న ఆరోపణలపై కేంద్ర ఏజెన్సీ గత 2 సంవత్సరాలుగా రుణ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ యాప్‌లు తిరిగి చెల్లింపు కోసం రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై కఠిన ఆంక్షలతో అణిచివేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications