PF New rules: ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగుల నిధులను నిర్వహిస్తున్న సంస్థల్లో ఒకటిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు పేరుంది. ప్రతినెలా ఆయా కంపెనీలు తమ ఉద్యోగుల PF అమౌంట్‌ను సంస్థకు బదిలీ చేస్తుంటాయి. అలా చేయడంలో ఆలస్యమైతే సదరు కంపెనీలపై EPFO పెనాల్టీ విధిస్తుంది. అయితే తాజాగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి కీలక మార్పులు చేయాలని చూస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ మరియు ఇన్సూరెన్స్ చందాలను డిపాజిట్ చేయడంలో విఫలమైన కంపెనీల నుంచి EPFO జరిమానా వసూలు చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఛార్జీలను తగ్గించేందుకు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. జరిమానాను గణనీయంగా తగ్గించడంతో పాటు డీఫాల్ట్ వ్యవధితో సంబంధం లేకుండా రుసుము వర్తించేలా ప్రతిపాదించింది.

కేంద్ర ప్రభుత్వ చర్యను సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) వ్యతిరేకించింది. 'ఇప్పటికే ఉద్యోగులకు తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. సంపాదించిన వేతనాలను సైతం కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించే పేరుతో ఉద్యోగుల శ్రమకు అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది' అని ఓ ప్రకటనలో పేర్కొంది.
గతంలో PF చెల్లింపులో డీఫాల్ట్ అయిన 2 నెలలకుగాను EPFO ఏడాదికి 5 శాతం జరిమానా విధిస్తుండేది. 2 నుంచి 4 నెలల పాటు అయితే ఏడాదికి 10 శాతం ఛార్జీలు వేసేవారు. 4 నుండి 6 నెలల వరకు సంవత్సరానికి 15 శాతం, 6 నెలలకు పైగా కొనసాగితే ఏడాదికి 25 శాతం చొప్పున పెనాల్టీ వసూలుకు అవకాశం ఉంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం డీఫాల్టర్లు ఇప్పుడు కేవలం 1 శాతం మాత్రమే జరిమానా ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి 12 శాతం పే చేస్తే చాలు. ఈ నిబంధనల మార్పుపై ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఫైర్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications