ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తెస్తోంది. ఇప్పటికే 70 లక్షల మందికి సోకిన ఈ వైరస్ దాదాపు నాలుగు లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ఇంకా ఎంత మందికి సోకుతుందో తెలియదు. ఎంత మంది ప్రాణాలను తీస్తుందో తెలియదు. లాక్ డౌన్ లతో ఇక ఎంత మాత్రం ప్రయోజనం లేదు. వైరస్ తో కలిసి జీవించాల్సిందే. దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిందే. అందుకే, ప్రజలు మళ్ళీ తమ తమ పనులకు వెళ్లిపోతున్నారు. కానీ ప్రతి విషయంలోనూ చాలా మార్పులు సంభవించాయి. కరోనా కు ముందు, కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ తప్పనిసరి చేశారు. జీతాలు తగ్గించారు. దీంతో ఇక చేసేది లేక తమ ఖర్చులను తగ్గించుకునే ఏర్పాట్లలో ప్రజలు తలమునకలవుతున్నారు. ఇందుకోసం చాలా మంది సిటీ మధ్యలో నుంచి శివారు ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

ఖర్చుల తగ్గింపు లక్ష్యం...
కార్తీక్ హైదరాబాద్ లో ఒక ప్రముఖ ప్రకటనల ఏజెన్సీ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. జీతం నెలకు రూ 70,000 ఉండేది. కానీ కరోనా పుణ్యమా అని కంపెనీ ప్రస్తుతం 20% కోత విధిస్తున్నట్లు చెప్పింది. ఒక్కసారిగా నెలకు రూ 14,000 తరుగుదల. అంతకు ముందు సిటీ మధ్యలో 3 బీహెచ్ కె ఫ్లాట్ లో ఉండేవాడు. నెలకు రూ 25,000 అద్దె. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అది ఇక ఎంత మాత్రం సాధ్యం కాదని తేలిపోయింది. జీతం 5 ఏళ్ళ కనిష్ఠానికి పడిపోయింది. కంపెనీ వర్క్ ఫ్రొం హోమ్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇక సిటీ మధ్యలో నుంచి శివారు ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడు. రూ 12,000 అద్దెతో 2 బీహెచ్ కె ప్లాట్ కు మారిపోయాడు. ఇది ఒక్క కార్తీక్ కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులది ఇదే పరిస్థితి.

వర్క్ ఫ్రొం హోమ్ మాయ...
వర్క్ ఫ్రొం హోమ్ అనే కాన్సెప్ట్ ఒకప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ప్రస్తుతం అది దాదాపు అన్ని రంగాలకు విస్తరించింది. చాలా కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రొం హోమ్ ను తప్పనిసరి చేస్తున్నాయి కూడా. కొన్ని కంపెనీలైతే కనీసం 50% మంది ఉద్యోగులకు తప్పనిసరి వర్క్ ఫ్రొం ఇచ్చేస్తున్నాయి. దీంతో మన ఇల్లే చిన్న ఆఫీస్ లా మారిపోతోంది. దీంతో కంపెనీలకు చాలా ఖర్చులు మిగులుతున్నాయి. కనీసం 40% ఆఫీస్ వ్యయాలు తగ్గిపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కంపెనీలు కూడా వర్క్ ఫ్రొం ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. పైగా వర్క్ ఫ్రొం హోమ్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగినట్లు గుర్తించారు. సమయం ఏదైనా సరే ఉద్యోగులు పనిపూర్తి చేయడంపైనే దృష్టిసారిస్తున్నారు.

ప్రజా రవాణా కు గుడ్ బై...
ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో ప్రజా రవాణా వ్యవస్థకు అతిపెద్ద సవాలు ఎదురుకాబోతోంది. చాలా మంది ఈ పద్ధతికి స్వస్తి పలికే అవకాశం ఉంది. ఎందుకంటే వైరస్ వ్యాప్తి చెందేందుకు అధిక అవకాశం ఉండటమే కారణం. మరోవైపు చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ పద్ధతిలో పనిచేస్తుండటంతో ఆఫీస్ కు రావాల్సిన అవసరం తగ్గిపోతోంది. దీంతో ప్రతి పౌరుని సగటు ప్రయాణ సమయం భారీగా పడిపోతోంది. మరోవైపు వర్క్ ఫ్రొం హోమ్ మాత్రమే ఉన్న ఉద్యోగులు శివారు ప్రాంతాలకు వెళుతుండటంతో ఇక పై వారికి ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోతోంది. కాబట్టి, వారు రోజుకు సుమారు 3-4 గంటల ప్రయాణ సమయాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. సో, ఏ రకంగా చూసినా శివారు ప్రాంతాలు ఇప్పుడు సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications