IT News: హైదరాబాద్ IT కంపెనీ CEOను కిడ్నాప్ చేసిన ఉద్యోగులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్..
Hyderabad News: పలు టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారింది. కరోనా తర్వాత కొన్ని IT సంస్థలు సహా స్టార్టప్స్‌కు గడ్డు కాలం ఎదురైంది. ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనూ సంస్థకు సపోర్ట్‌గా పనిచేసిన సిబ్బంది కొందరైతే, వేతనాలు రాక జాబ్ మానేసిన వారు మరికొందరు. అయితే ఇప్పుడు చెప్పబోతున్న ఉద్యోగులు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించారు.
గిగ్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే IT కంపెనీ హైదరాబాద్‌లో సేవలందిస్తోంది. దానికి రవిచంద్రారెడ్డి CEOగా వ్యవహరిస్తున్నారు. కొన్ని విపరీత పరిస్థితుల కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో సదరు సంస్థ విఫలమైంది. చాలా కాలంగా ఇలాగే జరుగుతూ ఉండటంతో సిబ్బందికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా CEOను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ఈ వ్యవహారంలో కొందరు ఉద్యోగులు, కన్సల్టెంట్ల హస్తం ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఇది జరిగిన 4 రోజుల తర్వాత ఇందుకు కారణమైన 8 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నిందితుల నుంచి 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వివిధ కన్సల్టెన్సీల ద్వారా రిక్రూట్ చేసిన 1,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడమే ఘటనకు కారణమని వివరించారు.
కొంతమంది వ్యక్తులు తమ నివాసంలోకి అర్థరాత్రి బలవంతంగా ప్రవేశించారని రవిచంద్రారెడ్డి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. CEOను కిడ్నాప్ చేసే ముందు ఆ బృందం తనపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. ఇంట్లోని 84 ల్యాప్‌టాప్‌లను కూడా అపహరించినట్లు వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రవిచంద్రను శ్రీశైలం హైవేలోని ఓ హోటల్‌లో గుర్తించి రక్షించారు.


Click it and Unblock the Notifications