Elon Musk: ట్రెండ్ సెట్ చేయబోతున్న ఎలాన్ మస్క్.. టార్చ్ బేరర్‌గా మారనున్న కుబేరుడు
Trillionaire: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఎన్నో వివాదాలు మరెన్నో సంచలనాలకు ఆయన ఇప్పటికి వరకు మారుపేరుగా ఉన్నారు. అయితే మరో కొత్త రికార్డు ఖాతాలో వేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. 1916లో ప్రపంచం విన్న కొత్తపేరును మరోసారి తిరిగి నిర్వచించేందుకు సిద్ధమయ్యారు. మిలియనీర్లు, బిలియనీర్లను వెనక్కినెడుతూ కొత్తగా ట్రెండ్ సెట్ చేసేలా దూసుకుపోతున్నారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ మరియు X సంస్థల అధినేత సంపద గురించి వెల్త్ ట్రాక్ కంపెనీ ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ కీలక విషయాలు వెల్లడించింది. మస్క్ సంపద సగటు వార్షిక వృద్ధి రేటు 110 శాతంతో పెరుగుతోందని తెలిపింది. ఇప్పటికే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 251 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మస్క్ కొనసాగుతున్నారు. కాగా ఇప్పుడు అకాడమీ 2024 ట్రిలియన్ డాలర్ క్లబ్ నివేదిక కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇదే సమయంలో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ట్రిలియనీర్ హోదాను సాధించే రెండవ వ్యక్తి అవుతారని అకాడమీ విశ్లేషణ సూచించింది. అదానీ గ్రూప్ వార్షిక వృద్ధి రేటు 123 శాతంగా ఉండటంతో 2028 నాటికి ట్రిలియనీర్ మార్క్‌ను రీచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాంకేతిక సంస్థ ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ మరియు ఇండోనేషియా ఎనర్జీ మరియు మైనింగ్ దిగ్గజం ప్రజోగో పాంగెస్టు కూడా 2028లో ట్రిలియనీర్లుగా మారవచ్చని పేర్కొంది. ఇక మెటా CEO మార్క జుకర్‌బర్గ్ మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని వెల్లడించింది.
1916లో ప్రపంచం తన మొదటి బిలియనీర్‌ను చూసినప్పటి నుంచి ఫస్ట్ ట్రిలియనీర్ ఎవరు అనే ప్రశ్న జనాన్ని ఆకర్షిస్తోంది. అయితే అపారమైన సంపదను కూడబెట్టడాన్ని చాలా మంది విద్యావేత్తలు సామాజిక అనారోగ్యంగా చూస్తారు. ఎందుకంటే ఒక నివేదిక ప్రకారం అత్యంత ధనవంతులైన 1 శాతం మంది 66 శాతం పేద వారి కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి ఉన్నారు. అంటే వాతావరణ సంక్షోభాన్ని ముందుండి నడిపిస్తున్నది వీరేనన్నది గమనార్హం.


Click it and Unblock the Notifications