Elon Musk: ఒక్క ట్వీట్ తో ఆయా కంపెనీల షేర్లను అమాంతం పెంచేయడం, పలు సంస్థలను తీవ్ర నష్టాల్లోకి నెట్టేయడం.. ఎలాన్ మస్క్ కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆయన కన్ను మైక్రోసాఫ్ట్ మీద పడినట్లు ఉంది. తమ అడ్వర్టైజింగ్ ప్లాట్ ఫారమ్స్ నుంచి ట్విట్టర్ ను తొలగిస్తామని IT దిగ్గజం చెప్పడంతో మస్క్ అందుకు బదులిచ్చారు. తమ సంస్థ డేటాను మైక్రోసాఫ్ట్ చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తోందంని ఆరోపించారు. దానిపై దావా వేస్తానని బెదిరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
"వారు ట్విట్టర్ డేటాను ఉపయోగించి చట్టవిరుద్ధంగా శిక్షణ పొందారు. ఇది వ్యాజ్యం సమయం" అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే మస్క్ తన అడ్వర్టైజింగ్ ప్లాట్ ఫారమ్ కు సంబంధించి ఏవైనా దీర్ఘకాలిక ప్రణాళికలు కలిగి ఉన్నారా అని ఓ వినియోగదారుడు ప్రశ్నించారు. బయటి నుంచి ట్విట్టర్ కి వచ్చే ట్రాఫిక్ పై ఈ చర్య తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. 'ట్విట్టర్ డేటాబేస్ ను చీల్చడం, ప్రకటనలను తొలగించడం, ఆపై మా డేటాను ఇతరులకు విక్రయించడం మాత్రం విజయవంతమైన పరిష్కారం కాదు' అని మస్క్ స్పందించారు.

తన API వినియోగదారుల నుంచి నెలకు కనీసం 42 వేల డాలర్లు వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల ట్విట్టర్ ప్రకటించింది. ఇందుకు ప్రతిగా వచ్చే వారం నుంచి తన ప్రకటనల ప్లాట్ ఫారమ్ నుండి ట్విట్టర్ ని తొలగిస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఏప్రిల్ 25, 2023 నుంచి మల్టీ-ప్లాట్ ఫారమ్ తో కూడిన స్మార్ట్ క్యాంపెయిన్‌లు ఇకపై ట్విట్టర్ కి మద్దతు ఇవ్వవు అని టెక్ దిగ్గజం తన ప్రకటనల వెబ్ పేజీలో తెలిపింది.
ఇలా చేయడం వల్ల మైక్రోసాఫ్ట్ వినియోగదారులు దాని సోషల్ మేనేజ్‌మెంట్ సాధనం ద్వారా వారి ట్విట్టర్ ఖాతాలను యాక్సెస్ చేయలేరు. డ్రాఫ్టులు లేదా ట్వీట్‌లను సృష్టించలేరు మరియు నిర్వహించలేరు. గత ట్వీట్‌లను సైతం వీక్షించే అవకాశాన్ని కోల్పోతారు. ఇకమీదట ట్వీట్‌లను షెడ్యూల్ చేయలేరు. అయితే ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ మరియు లింక్డ్ ఇన్ సేవలు మాత్రం అందుబాటులో కొనసాగుతాయని టెక్ దిగ్గజం స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications