Tesla: ఇండియాకు టెస్లా ఫ్యాక్టరీ..! డెడ్ చీప్ రేట్లకే ఎలక్ట్రిక్ కార్లు.. మస్క్ ఇన్ టాక్స్..
Elon Musk: దేశంలో ఎన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి విక్రయిస్తున్నప్పటికీ.. టెస్లా కొనుక్కోవాలనేది చాలా మంది ఆకాంక్ష. అయితే మస్క్ దీనిని ఎప్పుడు ఇండియాలోకి ప్రవేశపెడతారా అని వేచిచూస్తున్నారు.
ఈ క్రమంలో గత నెల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. దేశంలో టెస్లా గిగాఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు బయటకు వచ్చాయి. చర్చలు సఫలీకృతం అయితే.. త్వరలోనే టెస్లా కార్లు భారతీయ రోడ్లపై పరుగులు తీయవచ్చని తెలుస్తోంది.

ఏటా 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగల సామర్థ్యంతో దేశంలో ఒక గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు టెస్లా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అసలు ఇండియాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలా..? వద్దా..? అని టెస్లా కొన్నేళ్లుగా ఆలోచిస్తోంది. అయితే ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేసేందుకు ఉన్న సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని మస్క్ టీమ్ చర్చలను ముందుగు తీసుకెళుతోందని వెల్లడైంది.
ప్రస్తుతం టెస్లా అతిపెద్ద ప్లాంట్ చైనాలో దాదాపు 7,50,000 యూనిట్ల వార్షిక కార్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇదే క్రమంలో ఆపిల్, శామ్సంగ్ వంటి టెక్ కంపెనీలు చైనా ప్రభుత్వ కఠిన ఆంక్షల నేపథ్యంలో ఏర్పడుతున్న ఉత్పత్తి నష్టాలను తగ్గించుకునేందుకు, ఇతర ప్రాంతాల్లో అమ్మకాలను మెరుగుపరుచుకునేందుకు తమ ఫ్యాక్టరీలను ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఇదే దారిలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
గత నెలలో అమెరికాలో టెస్లా సీఈవోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అనంతరం ఈ చర్చలు జరగటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చర్చలు ఫలవంతమైతే కంపెనీ తన కార్లను రూ.20 లక్షలకు అందుబాటులోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. మస్క్ యాజమాన్యంలోని టెస్లా ఇండియాలో ఆటోమోటివ్ విడిభాగాల కోసం దాని స్వంత సరఫరా గొలుసును ఏర్పాటు చేయాలనుకుటోంది. ఇదే క్రమంలో భారత్ లో ప్లాంట్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications