చైనాలో గూఢచర్యం.. టెస్లాను మూసివేస్తామన్న ఎలాన్ మస్క్
చైనాలో తమ కార్లు గూఢచర్యానికి పాల్పడితే కనుక తమ కంపెనీని మూసివేస్తామని టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ చెప్పారు. చైనాలోని మిలిటరీ కేంద్రాల పరిధిలో టెస్లా కార్యకలాపాలను నిషేధించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎలాన్ మస్క్ శనివారం ఈ అంశంపై స్పందించారు. కేవలం చైనాలోనే కాదని, ప్రపంచంలో ఎక్కడైనా టెస్లా కారు నిఘా చర్యలు చేపట్టినట్లు రుజువైతే తమ కార్ల తయారీ సంస్థను మూసివేస్తామని అన్నారు. ఈ మేరకు చైనా సంస్థ నిర్వహించిన వర్చువల్ సెమినార్‌లో మాట్లాడారు. ఎలాంటి సమాచారమైనా చాలా కాన్ఫిడెన్షియల్ అన్నారు.

బయట పార్క్ చేయాలని...
చైనాలోని మిలిటరీ కేంద్రాల పరిధిలో టెస్లా కార్యకలాపాలను నిషేధించినట్లుగా ప్రచారం జరిగింది. టెస్లా వాహనాలను మిలిటరీ ప్రాపర్టీకి బయట పార్క్ చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ టెస్లా కార్లలోని కెమెరాలను చైనాపై గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే ఆందోళనతో ఈ నోటీసులు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మల్టీ డైరెక్షన్ కెమెరాలు, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ లొకేషన్స్‌ను బహిర్గతం చేస్తాయని, కాబట్టి రహస్య సైనిక సమాచార భద్రతను నిర్ధారించేందుకు ఈ కార్లను సైనిక నివాసాల నుండి నిషేధిస్తున్నట్లు తెలిపింది.

కెమెరాలు ఇన్‌స్టాల్
టెస్లా ఇంక్ సంస్థ తన కార్లలో కెమెరాలను ఇన్‌స్టాల్ చేసిందని, దీంతో తమ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో ఆ సంస్థ కార్లను తమ కాంప్లెక్స్‌ల్లోకి ప్రవేశించడానికి వీల్లేదని చైనా మిలిటరీ నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రచారం సాగింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు దేశాల మధ్య వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే విషయమై ఇరు పక్షాల అగ్రశ్రేణి దౌత్యవేత్తలు అలస్కాలో తొలిసారి ముఖాముఖీ చర్చలు జరుపుతున్న వేళ ఈ ఆరోపణలు రావడం గమనార్హం.

పరస్పర విశ్వాసం
తమ కార్లు గూఢచర్యం చేస్తే టెస్లాను మూసివేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్ ఇంకా మాట్లాడుతూ... అమెరికా, చైనా మధ్య పరస్పర విశ్వాసం అవసరమన్నారు. ఈ వర్చువల్ సదస్సును చైనా విదేశాంగశాఖ మండలి ఆధ్వర్యంలోని ఫౌండేషన్ సంస్థ నిర్వహించింది. చైనా అతిపెద్ద కార్ల మార్కెట్‌గా నిలిచింది. ప్రత్యేకించి విద్యుత్ కార్ల విక్రయానికి వివిధ కార్ల సంస్థల మధ్య పోటీ ఉంది.


Click it and Unblock the Notifications