25.6 మిలియన్ డాలర్ల టెస్లా షేర్లు అమ్మేసిన ఎలాన్ మస్క్ సోదరుడు
టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ సోదరుడు కింబాల్ మస్క్ 25.6 మిలియన్ డాలర్ల తన షేర్లను విక్రయించారు. అతను ఎలాన్ సోదరుడు మాత్రమే కాకుండా టెస్లా ఇంక్ బోర్డు మెంబర్ కూడా. ఈ ఎలక్ట్రిక్ కార్‌మేకర్ సంస్థలో భారీ మొత్తంలో షేర్లను విక్రయించారు. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపారు. టెస్లా షేర్లు గత ఏడాది కాలంలో భారీ ఎత్తున ఎగిసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు.

30వేల షేర్ల విక్రయం
48 సంవత్సరాల కింబాల్ మస్క్ ఫిబ్రవరి 9వ తేదీన 30,000 షేర్లను విక్రయించారు. సగటున 852.12 డాలర్లకు వీటిని విక్రయించినట్లు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపారు. 2020 క్యాలెండర్ ఏడాదిలో టెస్లా షేర్లు 743 శాతం ఎగిశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 14 శాతం లాభపడ్డాయి. అయితే బుధవారం మాత్రం 5.3 శాతం మేర క్షీణించి 804.52 డాలర్లకు పడిపోయింది.

మరొకరు కూడా
కింబాల్ మస్క్ ఈ సంస్థలో తన షేర్లను విక్రయించడంతో అతని షేర్లు 599,740కి తగ్గాయి. వీటి వ్యాల్యూ 483 మిలియన్ డాలర్లుగా ఉంది. సమాచారం మేరకు టెస్లా ఇంక్‌లో ఇన్‌సైడర్స్ 19.6 శాతం వాటాను కలిగి ఉన్నారు. కింబాల్ మస్క్‌తో పాటు మరో బోర్డు మెంబర్ ఆంటోనియో గ్రేసియాస్ కూడా 150,74 షేర్లను విక్రయించారు. కంపెనీలో అతను 2545 స్టాక్ హోల్డింగ్ కలిగి ఉన్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విక్రయించినట్లుగా తెలుస్తోంది. దీనిని లాంగ్ టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్ అని పిలుస్తారు. గ్రేసియాస్ జూన్ 2022, 2025 కాల్ ఆప్షన్ ఎక్స్‌పైరింగ్‌తో 150000 కొనుగోలు చేశాడు. పరోక్షంగా అతను ఏజేజీ గ్రోత్ ఫండ్ ద్వారా 1.3 మిలియన్ల టెస్లా షేర్స్ కలిగి ఉన్నాడు.

ది కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ సీఈవో
కింబాల్ మస్క్... ది కిచెన్ రెస్టారెంట్ గ్రూప్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కో ఫౌండర్‌గా ఉన్నారు. గ్రేసియాస్ వాలోర్ ఈక్విటీ పార్ట్‌నర్స్ ఫౌండర్. కాగా, గ్లోబల్ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా యాజమాన్యం 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. బిట్ కాయిన్‌లో అత్యధిక పెట్టుబడులు పెట్టిన సంస్థగా టెస్లా నిలిచింది. బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెస్లా తెలిపింది. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ 16 శాతం పెరిగి 45 వేల డాలర్లకు చేరుకుంది. తమ సంస్థ విద్యుత్ కార్ల చెల్లింపుల కోసం డిజిటల్ కరెన్సీని అంగీకరించనున్నట్లు టెస్లా తెలిపింది.


Click it and Unblock the Notifications