Elon Musk: జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ సాదర స్వాగతం.. అధిక ఆదాయం సహా స్వేచ్ఛకు హామీ
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా X(గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. జర్నలిస్టులకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్, X వంటి సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ క్రియేటర్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఇదే అవకాశాన్ని పాత్రికేయులకు సైతం ఇవ్వనున్నట్లు మస్క్ ప్రకటించారు.
జర్నలిస్టులు తమ కంటెంట్ ను Xలో పోస్ట్ చేయాలని మస్క్ కోరారు. అధిక ఆదాయం సహా మరింత స్వేచ్ఛగా రాసేందుకు తాను సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిన్న Xలో మస్క్ ట్వీట్ కూడా చేశారు. Xలో వార్తా కథనాలు చదవడానికి వినియోగదారులు ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందని మస్క్ గతంలోనే ప్రకటించారు. కాగా దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

నెలవారీ సబ్ స్క్రిప్షన్ చెల్లించడానికి ఇష్టపడని వినియోగదారులు.. తాము చదవాలనుకున్న కథనానికి మాత్రమే ధర చెల్లించే ఓ కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన గత ఏప్రిల్ లో వెల్లడించారు. ఇది అటు మీడియా సంస్థలకు, ఇటు X యూజర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ తరహా విధానంపై పబ్లిషర్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. తమ సైట్స్ కు ట్రాఫిక్ ని మళ్లించేందుకు ప్రచురణకర్తలు సామాజిక ప్లాట్ఫామ్స్ పై ఎక్కువగా ఆధారపడతారు. తాజాగా తీసుకొచ్చిన ఈ మార్పులు వారికి మరింత ఇబ్బంది కలగజేస్తాయి. ఈ వ్యవహారాన్ని నేరుగా మస్క్ ముందుకు తీసుకెళ్లేందుకు పబ్లిషర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications