Elon Musk: "రిటైర్మెంట్ కోసం పొదుపు చేయకండి!" మస్క్ సలహా వెనుక అసలు రహస్యం ఇదే!
సాధారణంగా ఏ ఆర్థిక నిపుణుడిని అడిగినా.. "మీరు చిన్న వయసు నుండే రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం మొదలుపెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ లేదా పీఎఫ్ అకౌంట్లు తెరవండి" అని సలహా ఇస్తారు. కానీ, దాదాపు 600 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ఎలన్ మస్క్ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ కోసం భారీగా డబ్బు దాచుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండదని ఆయన చెబుతున్నారు. పీటర్ డయామాండిస్ తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అందరికీ 'యూనివర్సల్ హై ఇన్‌కమ్' (Universal High Income)!
ఎలన్ మస్క్ అంచనా ప్రకారం.. టెక్నాలజీ పెరుగుతున్న వేగం చూస్తుంటే భవిష్యత్తులో యంత్రాల ఉత్పాదకత ఊహించని స్థాయికి చేరుతుంది. మనుషుల కంటే రోబోలు, ఏఐ (AI) చాలా వేగంగా, చౌకగా, సమర్థవంతంగా పనులు చేస్తాయి. దీనివల్ల వస్తువుల కొరత అనేదే ఉండదు. భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి సరిపడా వనరులు అందుబాటులోకి వస్తాయి. ఈ క్రమంలోనే ఆయన 'యూనివర్సల్ హై ఇన్ కమ్' అనే కాన్సెప్ట్ ను పరిచయం చేశారు. అంటే మనుషులు పని చేసినా, చేయకపోయినా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సరిపడా ఆదాయం అందరికీ అందుతుందట!
ఉచిత విద్య, అద్భుతమైన వైద్యం!
మస్క్ మాటల్లో చెప్పాలంటే, రాబోయే కొద్ది ఏళ్లలోనే మనిషి కోరుకున్న ప్రతిదీ అతడి ముందు ఉంటుంది. ఇప్పుడు మనం పొందుతున్న వైద్యం కంటే వేల రెట్లు మెరుగైన హెల్త్ కేర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అలాగే ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన పని ఉండదు. విద్య పూర్తిగా ఉచితంగా, అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి ప్రపంచంలో రిటైర్మెంట్ కార్పస్ (Retirement Corpus) లేదా పొదుపు అనేది అర్థరహితమని ఆయన భావిస్తున్నారు.
డబ్బు సమస్య కాదు.. మరి సమస్య ఎక్కడ?
అయితే ఇక్కడే మస్క్ ఒక పెద్ద చిక్కుముడిని విప్పారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేని లోకంలో మనిషికి 'మానసిక సమస్యలు' ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. "మీరు కోరుకున్న ప్రతిదీ మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఇక పని చేయాల్సిన అవసరం లేనప్పుడు.. జీవితం మీద మీకు ఆసక్తి ఉంటుందా?" అని ఆయన ప్రశ్నించారు. పని లేకపోతే జీవితం తన అర్థాన్ని కోల్పోతుందని, ఆ సమయంలో మనిషి తన ఉనికి గురించి, జీవిత లక్ష్యం గురించి మదనపడాల్సి వస్తుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా ఎలన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తును ముందుగానే ఊహిస్తాయి. ఆయన చెప్పినట్లుగా టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయవచ్చు, కానీ అది మనిషిని సోమరిగా మారుస్తుందా? లేక కొత్త శిఖరాలకు చేరుస్తుందా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం రిటైర్మెంట్ ప్లానింగ్ ను పక్కన పెట్టకండి! ఎందుకంటే మస్క్ లాంటి మేధావుల అంచనాలు నిజం కావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు.


Click it and Unblock the Notifications