Elon Musk: జాత్యహంకారంపై మస్క్ కీలక వ్యాఖ్యలు.. రెండేళ్ల క్రితం ఎదురుదెబ్బ.. ఇప్పుడేమో ఇలా..
Musk opinion on Racism: అపర కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ముక్కుసూటి వ్యక్తి. అనుకున్న విషయాన్ని నిరభ్యంతరంగా చెప్పేస్తాడు. తన అభిప్రాయాలను వెల్లడించడంలో ఏమాత్రం వెనకంజ వేయడు. కాగా ఇప్పుడు జాత్యహంకారం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాత్యహంకారం వల్ల తాను కలత చెందానని చెప్పి ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. 'ది డాన్ లెమన్ షో'లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని తన అభిప్రాయం తెలియజేశారు. 'సమాజంలో అసమానతల గురించి తెలుసుకోవడం మంచిదే. అయితే ప్రతిదాన్నీ జాతి సమస్యగా మార్చడానికి ప్రయత్నించడం తప్పు. ఇలా చేయడం సమాజాన్ని విభజించి, తినివేయడంతో సమానం' అని పేర్కొన్నారు.

సమాజం చాలా విషయాలను నిందిస్తుంది మరియు జాత్యహంకారం అన్యాయమని నొక్కి చెబుతుంది అంటూనే ఈ సమస్యకు మస్క్ ఒక పరిష్కారాన్ని కూడా ప్రతిపాదించాడు. ప్రతిఒక్కరినీ మనిషిగా గౌరవించాలని, వారి వెనుక ఉన్న జాతిని చూడవద్దని సూచించారు. పాత, మూఢ విశ్వాసాల నుంచి బయటకు వచ్చి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ట్రాన్స్ అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ సమయంలో జాత్యహంకారం విపరీతంగా ప్రబలిందనే ఆలోచనతో మస్క్ విభేదించారు. గతంలోకి చూడటం కంటే భవిష్యత్తు వైపు సాగాల్సిన సమయం ఇది అని అభిప్రాయపడ్డారు. మనం దాని గురించి నాన్‌స్టాప్‌గా మాట్లాడుకుంటూ ఉంటే, అది ఎప్పటికీ మన మధ్య నుంచి పోదు అని చెప్పారు.
ఈ 21వ శతాబ్దంలో జాత్యహంకారం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఓ శ్వేతజాతీయుడిగా తనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయని ఎలోన్ మస్క్ ఎదురు ప్రశ్నించారు. అయితే 2022లో 15 మంది నల్లజాతి ఉద్యోగులు టెస్లాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమను జాతి నెపంతో దూషిస్తున్నారని, శారీరక హింసకు గురిచేస్తున్నారని దావా వేశారు. ఆ సిబ్బంది పట్ల వ్యవహరించిన తీరుపై కంపెనీకి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ కూడా తగిలడం గమనార్హం.


Click it and Unblock the Notifications