Twitter Layoff: ఎలాన్ మస్క్ రెండు నాలుకల ధోరణి మరోసారి బయటపడింది. ట్విట్టర్ కొనుగోలు చేసిన సమయంలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. ముందుగా పనివేళలు, టైట్ వర్క్ షెడ్యూల్ ఇచ్చి ఉద్యోగులు తామంతట తామే వెళ్లిపోయేలా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అది ఫలించక పోవటంతో చివరికి మాస్ లేఆఫ్ ప్రకటించాడు.
ప్రపంచ వ్యాప్తంగా..
గ్లోబల్ ఉద్యోగాల కోతలో భాగంగా ట్విట్టర్ తన ఉద్యోగులను భారతదేశంలోనూ తొలగించడం ప్రారంభించింది. ఈరోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. పరాగ్ అగర్వాల్ తొలగింపుతో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. భారతదేశంలోని ట్విట్టర్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ టీం తొలగింపు ఇందులో భాగంగా ఉంది.

వరుస రాజీనామాలు..
సీఈవో, సీఎఫ్‌వోలను తొలగించిన తర్వాత టాప్ మేనేజ్‌మెంట్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేశారు. కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించేందుకు ట్విట్టర్ శుక్రవారం భారీ తొలగింపులను ప్రకటించింది. కంపెనీ తొలగించాలని నిర్ణయించిన ఉద్యోగుల పర్సనల్ మెయిల్ కు కంపెనీ ఈ సందేశాన్ని పంపింది. దీనిపై స్పందించిన ఒక భారతీయ ఉద్యోగి తన తోటి కొంతమంది సహోద్యోగులకు దీనిపై ఈ-మెయిల్ వచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించాడు.
భారతీయులే టార్గెట్..?
ఎలాన్ మస్క్ తొలగింపు విధానం వల్ల ట్విట్టర్‌లోని భారతీయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ప్రభావితమయ్యారని తెలుస్తోంది. అంతకుముందు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్‌లో ట్విట్టర్‌ను మెరుగైన మార్గంలో నడిపించే ప్రయత్నంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇది కష్టమైన ప్రక్రియే అయినప్పటికీ.. తప్పక తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

తాత్కాలిక మూసివేత..
తొలగింపులపై ట్విట్టర్ ఇండియా ఇంతవరకు స్పందించనప్పటికీ.. ఇంజనీరింగ్, మార్కెటింగ్ తో పాటు మరిన్ని విభాగాల్లో ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ సిస్టమ్‌లను, కస్టమర్ డేటాకు సంబంధించిన అన్ని కార్యాలయాలను కంపెనీ తాత్కాలికంగా మూసివేస్తుందని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ట్విట్టర్ స్పష్టం చేసింది. మీరు ఆఫీసులో ఉన్నా లేక ఆఫీసులకు వెళ్లే దారిలో ఉన్నా.. దయచేసి ఇంటికి తిరిగి వెళ్లిపోండి అంటూ కంపెనీ తొలగించిన ఉద్యోగులకు మెయిల్స్ పంపటం సంచలనంగా మారింది.

50% ఔట్..
Twitter తన 7,500 మంది ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని తగ్గించవచ్చని తెలుస్తోంది. మస్క్ రాకతో ట్విట్టర్ నుంచి చాలా మంది తమ ఖాతాలను డీయాక్టివేట్ చేస్తున్నారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 1 మధ్య కాలంలో 8,75,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలను క్లోజ్ చేశారు. అయితే మరో అర మిలియన్ మంది సస్పెండ్ చేయబడ్డారు.


Click it and Unblock the Notifications