Elon MusK: ఎలాన్ మస్క్ భారత్ టూర్ క్యాన్సిల్.. టెస్లా ఇండియా రాకకు బ్రేక్.. ఇదీ రీజన్
Tesla News: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతీయ మార్కెట్‌పై కన్నేశారు. తన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాను ఇండియాలో లాంచ్ చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కంపెనీ ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడానికి ఎలాన్ మస్క్ భారత్ సందర్శనకు రావాలని గతంలోనే నిర్ణయించుకున్నారు.
కానీ తాజాగా మస్క్ తన భారత పర్యటన ప్రణాళికను విరమించుకున్నట్లు ప్రకటించారు. ఇండియాకు వచ్చే ఒక్కరోజు ముందు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు. దీంతో తన రెండు రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకుని, భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశాన్ని ప్రకటించాలన్న ప్లాన్ ఫెయిల్ అయినట్లయింది. అయితే ఈ ఏడాది చివర్లో భారత సందర్శనకు ఆసక్తిని వ్యక్తం చేశారు.

'దురదృష్టవశాత్తూ, టెస్లాకు సంబంధించి భారీ బాధ్యతల కారణంగా భారత్ సందర్శన ఆలస్యం అవుతోంది. కానీ ఈ సంవత్సరం చివర్లో ఇండియా పర్యటన కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను' అని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 23న USలో జరిగే కీలక కాన్ఫరెన్స్ కాల్‌కు మస్క్ హాజరు కావాల్సిన అవసరాన్ని బట్టి భారతదేశ సందర్శన వాయిదా వేయబడినట్లు తెలుస్తోంది.
భారతదేశం ఇటీవల కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విధానం గురించి నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి కట్టుబడి ఉన్న కంపెనీలకు డ్యూటీ రాయితీలను అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రధానితో చర్చలతో పాటు అంతరిక్ష రంగ స్టార్టప్‌లు మరియు ఇతర వ్యాపార ప్రముఖులతో సమావేశం కావాలని భావించారు. మస్క్ తాజా ప్రకటనతో వాటన్నిటికీ బ్రేక్ పడింది.


Click it and Unblock the Notifications