ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధం.. X ఓ మురికి గుంట అంటూ ఇజ్జత్ తీసేసిన మైఖేల్ ఓ లియరీ
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన లక్ష్యం యూరప్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ రైయానైర్ (Ryanair). తన సోషల్ మీడియా వేదిక Xలో మస్క్.. రైయానైర్‌ను కొనుగోలు చేయాలా? అనే అంశంపై అనుచరులతో పోల్ నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ పోల్‌లో 9 లక్షల మందికి పైగా పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంపై రైయానైర్ యాజమాన్యం లేదా సంస్థ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ఈ వ్యవహారానికి నేపథ్యం స్టార్‌లింక్ (Starlink) సేవలపై ఏర్పడిన ఘర్షణగా చెప్పవచ్చు. స్పేస్‌ఎక్స్ ద్వారా అభివృద్ధి చేసిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సిస్టమ్‌ను విమానాల్లో వైఫై సేవల కోసం వినియోగించడంపై రైయానైర్ సీఈఓ మైఖేల్ ఓ లియరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఐరిష్ రేడియో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, స్టార్‌లింక్ వ్యవస్థను విమానాల్లో అమర్చడం వల్ల అదనపు యాంటెన్నాల కారణంగా డ్రాగ్ పెరిగి.. ఇంధన వినియోగం అధికమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీని వల్ల కంపెనీకి సంవత్సరానికి సుమారు 250 మిలియన్ డాలర్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని ఆయన అంచనా వేశారు.

అంతేకాకుండా..రైయానైర్ ప్రయాణికులు విమానంలో ఇంటర్నెట్ సేవ కోసం డబ్బు చెల్లించడానికి ఆసక్తి చూపరని కూడా లియరీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలోన్ మస్క్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ప్రతిస్పందనగా మస్క్.. లియరీని బహిరంగంగానే నిజమైన మూర్ఖుడుగా అభివర్ణించారు. అంతేకాదు, రైయానైర్ సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంలో లియరీ కూడా వెనక్కి తగ్గలేదు.
ఎలన్ మస్క్‌కు విమానాలు, డ్రాగ్ గురించి అసలు అవగాహన లేదు. అతను తన X అనే మురికిగుంటలో ఏమి పోస్ట్ చేసినా నాకు పట్టదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతను చాలా ధనవంతుడు కావచ్చు, కానీ మూర్ఖుడే అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఈ పరస్పర ఆరోపణలు ఇద్దరి మధ్య వివాదాన్ని మరింత ముదిర్చాయి.
ప్రస్తుతం రైయానైర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 30 బిలియన్ యూరోలు (దాదాపు 35 బిలియన్ డాలర్లు)గా ఉంది. అయితే ఎలోన్ మస్క్ వాస్తవంగా రైయానైర్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం.. EUలో పనిచేసే విమానయాన సంస్థలు యూరోపియన్ యూనియన్ పౌరుల ఆధిపత్య యాజమాన్యంలోనే ఉండాలి. కాబట్టి, అమెరికన్ పౌరుడైన మస్క్‌కు నేరుగా పూర్తి యాజమాన్యం సాధ్యం కాదు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే Elon Musk గతంలోనూ భారీ కొనుగోళ్లకు పేరుగాంచారు. 2022లో ఆయన ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి.. ఆ తర్వాత దానిని X గా పేరు మార్చారు. ఇప్పుడు రైయానైర్ అంశంపై చేసిన పోల్ నిజమైన వ్యాపార ఆసక్తి సూచనా? లేక మరోసారి మస్క్ తన సోషల్ మీడియా ప్రభావాన్ని చూపించడానికే చేసిన చర్యనా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ వివాదం యూరోపియన్ విమానయాన రంగం, టెక్ రంగాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications