Elon Musk: చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ కంపెనీ.. AIతో సహజీవనానికి తొలి అడుగు
AI News: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. ట్విట్టర్ నుంచి స్పేస్ X వరకు వివిధ రకాల వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన కంపెనీ న్యూరాలింక్ తాజాగా ఓ సంచలనానికి తెరతీసింది.
ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా ఓ న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్‌ను నెలకొల్పారు. మానవ మెదడు మరియు కంప్యూటర్ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గాలను రూపొందించడమే దీని లక్ష్యం. తద్వారా కృత్రిమ మేధస్సుతో మనిషి సహజీవనాన్ని సుసాధ్యం చేయాలని చూస్తోంది. కాగా ఇప్పుడు మొదటిసారి మెదడులో చిప్‌ను ఇంప్లాంట్ చేసి విజయం సాధించింది.

'ఓ మానవుడు మొదటగా నిన్న న్యూరాలింక్ నుంచి ఇంప్లాంట్ పొందాడు. ఇప్పుడు కోలుకుంటున్నాడు. ప్రారంభ ఫలితాలు ఆశాజనక న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను చూపుతాయి. అని మస్క్ Xలో పోస్ట్ చేశారు. అయితే 2016లో స్థాపించబడిన ఈ స్టార్టప్.. భవిష్యత్తులో మానవ సామర్థ్యాలను సూపర్ ఛార్జ్ చేయడం, ALS లేదా పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్స అందించడం వంటి కార్యకలాపాలు చేపట్టాలని చూస్తోంది.
మానవ మెదడులో ఇంప్లాంట్లను పరీక్షించేందుకు US రెగ్యులేటర్ల నుంచి స్టార్టప్ గతేడాది ఆమోదం పొందింది. లింక్ అనే ఇంప్లాంట్ ఆధారంగా న్యూరాలింక్ సాంకేతికత పని చేస్తుంది. ఇన్వాసివ్ సర్జరీ ద్వారా మానవ మెదడు లోపల ఐదు పేర్చబడిన నాణేల పరిమాణంలో ఉండే పరికరాన్ని అమరుస్తారు.
డేటా కంపెనీ పిచ్‌బుక్ ప్రకారం.. కాలిఫోర్నియాకు చెందిన న్యూరాలింక్ గత సంవత్సరం 400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. 363 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. అయితే ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ ఇదే తరహాలోని తన మొదటి పరికరాన్ని ఓ US రోగికి జూలై 2022లో అమర్చడం గమనార్హం.


Click it and Unblock the Notifications