ఏపీకి మరో భారీ పెట్టుబడి.. 5 వేల కోట్ల ప్రముఖ కంపెనీ తయారీ కేంద్రం..
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వెలువడింది. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో 5 వేల కోట్ల పెట్టుబడితో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,495 ప్రత్యక్ష ఉద్యోగాలు అలాగే దాదాపు 10 వేల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ కొత్త ప్లాంట్ కోసం మే 8న శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం మొత్తంగా 247 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ ద్వారా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇంకా వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేస్తుంది.
ఉత్పత్తి ప్రారంభం ఎప్పుడంటే :LG ఎలక్ట్రానిక్స్ వచ్చే ఏడాది డిసెంబర్ 2026 నాటికి కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించాలని చూస్తుంది. ఈ పెట్టుబడి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం. అయితే రాష్ట్ర తయారీ విధానం కింద మొట్టమొదటి ప్రముఖ తయారీ సముదాయం.
భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న LG ఎలక్ట్రానిక్స్ సప్లయర్స్ : LG ఎలక్ట్రానిక్స్ పెట్టుబడితో పాటు కంపెనీకి చెందిన నాలుగురు సప్లయర్లు కూడా రూ.839 కోట్ల పెట్టుబడితో ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. అయితే రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ మొత్తం పెట్టుబడి రూ.5,000 కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఈ పెట్టుబడి రాష్ట్ర తయారీ విధాన ప్రోత్సాహకాలకు అనుగుణంగా ఉండనుంది, వీటిలో స్టాంప్ డ్యూటీ ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేయడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వివిధ ప్రోత్సాహకాలను అందిస్తున్న ఎపి ప్రభుత్వం: LG ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తయారీ విధానం కింద చాల ప్రోత్సాహకాలను హామీ ఇచ్చింది. వీటిలో 20 సంవత్సరాల పాటు నీటి వినియోగంపై 100% సబ్సిడీ, నిర్మాణ పనులపై SGST రిటర్న్, విద్యుత్ సుంకం నుండి మినహాయింపు, 20 సంవత్సరాల పాటు విద్యుత్ సుంకానికి 50% సబ్సిడీ ఉన్నాయి. విద్యుత్, జలవనరుల వంటి విభాగాలు ప్రాజెక్టు అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఏపీకి ఎల్‌జీ పరిశ్రమను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేసినట్లు శ్రీసిటీ ఎండీ చెప్పుకొచ్చారు. అలాగే ఎల్‌జీ కంపెనీకి ప్రస్తుతం దేశంలో రెండే తయారీ ప్లాంట్లు ఉన్నాయని, వాటిలో ఒకటి పుణెలో, మరొకటి నోయిడాలో ఉందని తెలిపారు.


Click it and Unblock the Notifications