Election vs Mutual funds: సాంప్రదాయ బ్యాంక్ FDలకు భిన్నంగా ఈ మధ్యన ప్రజలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. మార్కెట్ రిస్కులు ఉంటాయని తెలిసి కూడా పెట్టుబడి పెట్టేందుకు వెనకడాటం లేదు. అయితే దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లతో పాటు ఆయా ఫండ్స్ అధిక రిటర్నులను ఇవ్వడమే ఇందుకు కారణం. బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థలు సాధారణ వడ్డీ ఇస్తుండగా.. మ్యూచువల్ ఫండ్స్ కాంపౌండింగ్‌తో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లు ఎంతో సున్నితంగా స్పందిస్తాయని తెలిసిందే. కరోనా వంటి పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా చూశాం. ప్రజాస్వామ్యంలో పెద్ద పండుగ అయిన ఎన్నికల ఫలితాల అనంతరం కూడా భారీ పెరుగుదల లేదా తగ్గుదల నమోదవుతాయి. మరి ఈ ఎలక్షన్స్ రిజల్స్ట్ మార్కెట్లపై ఆధాపడిన మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయని గమనించాలి.

అందువల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలపై ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా తగిన నిర్ణయాలు తీసుకుని తమ క్యాపిటల్‌ను భద్రపరుచుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఈ అస్థిరత స్వల్పకాలమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే దీర్ఘకాలంలో మార్కెట్లు ఆయా కంపెనీల ఆదాయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటాయని వివరిస్తున్నారు.
మిరే అసెట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన అంకిత్ జైన్ దీర్ఘకాలిక దృక్పథంతో ఏకీభవించారు. సదరు కంపెనీల వృద్ధి ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ ఆయా స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయని వెల్లడించారు. అందువల్ల ఎన్నికల ఫలితాలు ఈ ఫండ్స్‌పై అంతగా ప్రభావం చూపవని అభిప్రాయపడ్డారు. బలమైన విధాన పరమైన నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నారు. అందువల్ల ఇన్వెస్టర్స్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇచ్చారు.
మార్కెట్ అస్థిరతల ప్రభావాన్ని తప్పించుకోవాలంటే పోర్ట్‌ఫోలియో నిర్వహణలో చురుకుగా వ్యవహరించాలని జైన్ తెలిపారు. ఎన్నికలు వంటి స్పల్పకాలిక దృక్కోణాన్ని కాకుండా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే విధంగా డైవర్సిఫై చేయాల్సి ఉంటుందన్నారు. వైవిధ్య భరితమైన పోర్ట్‌ఫోలియో ఎటువంటి మార్కెట్ కుదుపులనైనా తట్టుకుని నిలబడగలదని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications