Costliest Stock: రోజుల్లో ఇన్వెస్టర్లను కుబేరులు చేసిన స్టాక్.. లక్ష పెడితే రూ.670 కోట్లు రాబడి..!!
Elcid Investment Shares: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో అందరి చూపు ఆ కంపెనీ షేర్లపైనే కొనసాగుతోంది. సాధారణంగా పెన్నీ స్టాక్స్ పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం మాట్లాడుకోబోతున్నది ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ల గురించే. ఈ పెన్నీ స్టాక్ లో పెట్టుబడులు పెట్టిన వారి తలరాత ఒక్కసారిగా మారిపోయింది.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో పెద్ద చర్చకు దారితీసిన స్టాక్ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. ఎందుకంటే తాజాగా మంగళవారం కంపెనీ షేర్ల ధర ఒక్కోటి ఏకంగా రూ.2,25,000 మార్కును అందుకుంది. అయితే స్టాక్ రోజులో మరో 5 శాతం పెరిగి రూ.2,36,250 మార్కును చేరుకుని ప్రయాణాన్ని ముగించింది. వాస్తవానికి ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. పైగా ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెట్టుబడుల కంపెనీ విభాగం కింద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా నమైదైంది. ఇది దేశంలోని అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటుంది. ఏషియన్ పెయింట్స్ లాంటి దిగ్గజ కంపెనీల్లో ఎల్సిడ్ సంస్థకు రూ.11,000 కోట్ల వరకు పెట్టుబడులు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం కంపెనీ షేర్లు ఎంఆర్ఎఫ్ కంటే ఎక్కువగా ఉండటంతో స్టాక్ ఖరీదైన కంపెనీల జాబితాలో చేరిపోయింది. ఇదే క్రమంలో కంపెనీలలో నల్వా సన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్, TVS హోల్డింగ్స్, కళ్యాణి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, SIL ఇన్వెస్ట్‌మెంట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, GFL, హర్యానా క్యాఫిన్, పిలానీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వంటి పేర్ల సరసన చేరిపోయింది. ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోటర్లు స్వచ్ఛందంగా ఒక్కో షేరుకు రూ.1,61,023 బేస్ ధరతో డీలిస్టింగ్ కోసం ఆఫర్ చేశారు. ఇందుకోసం ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయినప్పటికీ అవసరమైన మెజారిటీ పబ్లిక్ షేర్‌హోల్డర్‌లు రాకపోవడంతో తీర్మానం విఫలమైంది.
ధరావత్ సెక్యూరిటీస్‌కు చెందిన హితేష్ ధరావత్ ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏషియన్ పెయింట్స్‌లో హోల్డింగ్ కారణంగా దలాల్ స్ట్రీట్‌లో సంచలనంగా మారిందని పేర్కొన్నారు. కంపెనీ షేర్లు రూ.3 స్థాయి నుంచి నేరుగా రూ.2.35 లక్షలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాత్రికి రాత్రే తలరాత మారిపోవటం అంటే ఇదే. ఒక్కో షేరుకు రూ. 2.36 లక్షల వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ, ఏషియన్ పెయింట్స్‌లో హోల్డింగ్‌ని బట్టి ఈ స్టాక్ ఇప్పటికీ దాదాపు 45 శాతం తగ్గింపుతో దాని అంతర్గత షేరు ధర విలువ రూ. 4.25 లక్షలతో ట్రేడవుతోంది.
కొన్ని రోజుల కిందట కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.3.53గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షేర్ల విలువ 66,92,535 శాతం పెరిగిందని వెల్లడించారు. దీని ప్రకారం ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం కంపెనీ షేర్ల విలువ రూ.670 కోట్లకు చేరుకుంది. అయితే ఇలాంటి షేర్లు కొందామన్నా దొరకవని, కుటుంబ సభ్యుల మధ్యే ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే షేర్లను హోల్డ్ చేస్తున్న సాధారణ ఇన్వెస్టర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండవచ్చని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications