Byju's News: బైజూస్ మెగా ప్లాన్.. వణికిపోతున్న ఉద్యోగులు.. సంగతేంటంటే..
Byju's layoffs: దేశంలోని స్టార్టప్ కంపెనీలు లాభాల బాట పట్టడంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఆవిరైపోతున్న పెట్టుబడి సొమ్ముతో కొత్తగా ఫండింగ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయి.
ఈ తరుణంలో ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ కంపెనీకి కొత్త సీఈవోగా అర్జున్ మోహన్ అడుగుపెట్టారు. కంపెనీ మెగా రీస్ట్రక్చరింగ్ కార్యక్రమంలో భాగంగా వేలమంది ఉద్యోగులను తొలగించొచ్చని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ తొలగింపుల సంఖ్య 4,000-5,000 మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని వెల్లడైంది. గతంలో సైతం కంపెనీ అనేక రౌండ్లలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

దీర్ఘకాలంగా కంపెనీలో పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన మోహన్ గతవారం సీఈవోగా ఎంపికైన తర్వాత సంస్థలోని సీనియర్ నాయకులకు ఈ నిర్ణయాలను తెలియజేశారు. ఈ నిర్ణయం మార్కెటింగ్ టీమ్ పై కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎడ్టెక్ యునికార్న్ భారీగా లిక్విడిటీ పరిస్థితిని ఎదుర్కొంటున్నందున ఉద్యోగ కోతలు తెరపైకి వచ్చాయి. దీనికి ముందు కంపెనీ అద్దెల భారం మోయలేక బెంగళూరులో కార్యాలయాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.
కొత్త సీఈవో అర్జున్ మోహన్ రాకతో వ్యాపార రీస్ట్రక్చరింగ్ ప్రక్రియపై కసరత్తు ప్రస్తుతం చివరి దశలో ఉందని సమాచారం. ఈ ప్రక్రియను రాబోయే కొద్ది వారాల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇన్వెస్టర్ల ఆంక్షల వల్ల కంపెనీ తప్పక డబ్బు ఆదా చేయాల్సి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో బైజూ తన రుణదాతలకు వివాదాస్పద 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ Bని వచ్చే ఆరు నెలల్లోగా తిరిగి చెల్లించాలని ప్రతిపాదనను పంపింది. పరిస్థితులు పూర్తిగా చేజారిపోకముందే మేల్కొనేందుకు బైజూస్ యాజమాన్యం ప్రస్తుతం తీవ్రంగా కృషి చేస్తోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications