Mahesh Bank ED Raids: హైదరాబాదులో ఒక బ్యాంకుపై జరిగిన ఈడీ దాడులు పెద్ద ఆందోళనకు దారితీసింది. దీంతో బ్యాంకులో డబ్బులు జమచేసిన, దాచుకున్న ఖాతాదారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థలో పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించబడ్డాయి. 300 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో అధికారులు కోటి నగదు, 4 కోట్ల విలువైన ఆభరణాలు, విదేశీ కరెన్సీ, ఆస్తి పత్రాలు, బ్యాంక్ లాకర్ కీలు, నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

AP మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ షేర్‌హోల్డర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామ్ సుందర్ బియానీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలో బ్యాంక్ బోర్డు సభ్యులు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో మోసానికి పాల్పడ్డారని, డిపాజిటర్లు వాటాదారుల డబ్బును పెద్ద మొత్తంలో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా రూ.300 కోట్లకు పైగా అక్రమ రుణం మంజూరు చేయటంతో పాటు రూ.18.30 కోట్లు స్వాహా చేయడం వంటివి ఆరోపణల్లో కీలకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిర్యాదులు, ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు మొదట్లో ఈ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదు. అయితే దర్యాప్తుపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేయటంతో ఈడీ రంగంలోకి దిగేందుకు మార్గం సుగమం అయ్యింది.
కోటి రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినందుకు గాను బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, ఉమేష్ చంద్ అసవా, పురోషతమ్‌దాస్ మంధాన తదితరులపై హైదరాబాద్ కమిషనరేట్‌లోని బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. వక్ఫ్ బోర్డు భూములు, ఉనికిలో లేని ఆస్తులను తనఖాగా చూపించి వివిధ వ్యక్తులు, సంస్థకు రూ.300 కోట్లు రుణాలను అందించి వారి నుంచి 10% వరకు కమీషన్ వసూలు చేసినట్లు వెల్లడైంది. తప్పుడు బిల్లుల ద్వారా 6.5 కోట్లు, మోసపూరిత మార్గాల ద్వారా 1800 డమ్మీ వ్యక్తులు మరియు సంస్థలకు బంగారు రుణాలు పంపిణీలు జరగకం వంటివి వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో రుణాల మంజూరు, రుణ ఖాతాల నిర్వహణ, వాటి మూసివేతలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. నిందితులు, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ విలువలకు, కొన్ని సందర్భాల్లో గతంలో రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకుకు వచ్చిన వాల్యుయేషన్ కంటే తక్కువ ధరలకు ఆస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కొన్ని అనుమానాస్పద లావాదేవీలు కూడా వెల్లడయ్యాయి. దీంతో ప్రధాన నిందితులతో పాటు విచారణలో గుర్తించిన, మనీలాండరింగ్ నేరంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వారి సహచరులకు చెందిన వివిధ ప్రదేశాల్లో సైతం సోదాలు ఈడీ నిర్వహించింది.
మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 45 శాఖలను కలిగి ఉంది. వీటిలో 35 శాఖలు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఉండటంతో బ్యాంక్ కస్టమర్లలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications