ED News: నీరవ్ మోదీపై ఈడీ చర్యలు.. కోట్ల రూపాయల ఆస్తులు ఫసక్..!!
Nirav Modi: పెద్ద కుంభకోణాలకు పాల్పడి దేశాన్ని వీడి వెళ్లిపోయిన వారి ఆటలు కట్టింటే పనిలో మోదీ సర్కార్ ఉన్నట్లు కనిపిస్తోంది. వారు ప్రస్తుతం ఇండియాలో లేనప్పటికీ వారి నుంచి డబ్బు ముక్కు పిండి వసూలు చేసేందుకు ఈడీని రంగంలోకి దించింది.
పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోదీపై ఈడీ చర్యలు ప్రారంభించింది. దీంతో వారికి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో ఈడీ ఈ చర్య తీసుకుంది. ఈ క్రమంలో నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్‌లను ఈడీ అధికారులు సీజ్ చేసి స్వాధీనపరుచుకున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల నుంచి అందిన ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భారత శిక్షాస్మృతి 1860, అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ల కింద నీరవ్ మోదీపై సీబీఐ కేసు నమోదు చేసింది.

దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ బ్యాంకులను రూ.6,498.20 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, భారతదేశంలోని నీరవ్ మోడీ, అతని కంపెనీలకు చెందిన రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గుర్తించింది. వీటిలో భూమి, భవనాలు, బ్యాంకు ఖాతా డిపాజిట్లు కూడా ఉన్నట్లు తేలింది. ఈ కేసులో నీరవ్ మోదీపై మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద కూడా కేసు నమోదైంది. గతంలో విచారణ సందర్భంలో నిందితుడితో పాటు అతని సహచరులకు చెందిన రూ.2,596 కోట్ల విలువైన స్థిరచరాస్తులు జప్తు చేయబడ్డాయి. మరోవైపు ఆర్థిక నేరగాళ్ల చట్టం (FEOA) 2018 కింద నీరవ్ మోదీ, అతని సహచరులకు చెందిన రూ.692.90 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
కేసులో దర్యాప్తు తర్వాత రూ.1,052.42 కోట్ల విలువైన ఆస్తులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర బ్యాంకులకు తిరిగి వచ్చాయి. రూ.13 వేల కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ గత కొన్నేళ్లుగా పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో జైలులో ఉన్న అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తోంది. నీరవ్ మోడీ మరియు అతని మామ మెహుల్ చోక్సీ బ్యాంకు అధికారులతో కలిసి నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ ద్వారా బ్యాంకులను మోసం చేసిన వ్యవహారం 2018లో వెలుగులోకి వచ్చింది. ఇది భారతీయ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద ప్రకంపనలు సృష్టించింది.


Click it and Unblock the Notifications