దేశంలోని యువతకి స్టైలిష్ ఫ్యాషన్ అందిస్తున్న మింత్రా (Myntra) ఇప్పుడు అనూహ్యంగా విదేశీ పెట్టుబడుల నిబంధనలు (FDI Norms) ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టిలోకి వచ్చింది.

మింత్రా, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగమైన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ. స్టైలిష్ దుస్తులు, అన్‌లైన్‌లో కొనుగోలు చేసే కొత్తతరానికి ఇది ఓ బ్రాండ్‌గా మారిపోయింది. కానీ ఇప్పుడు అదే సంస్థపై రూ 1,654 కోట్ల విదేశీ పెట్టుబడి ఉల్లంఘనపై ED కేసు ఫైల్ చేసింది.
ఇది FEMA(ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) 1999 సెక్షన్ 16(3) కింద రిజిస్టర్ చేయబడిన కేసు. 2010లో FDI పాలసీలో "హోల్‌సేల్ ట్రేడింగ్" ఎలా ఉండాలనే దానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణ.
మింత్రా తన వ్యాపారం హోల్‌సేల్ మోడల్‌లో జరుగుతోందని ప్రకటించినా, వాస్తవంగా వారు నేరుగా కస్టమర్లకు వస్తువులు అమ్మే రీటైల్ వ్యాపారం (మల్టీ-బ్రాండ్ రీటైల్ ట్రేడ్) చేస్తున్నారు అని ఈడీ గుర్తించింది. ఈ రకమైన రీటైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు తీసుకోవాలంటే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతులు కావాలి. కానీ మింత్రా అలాంటి అనుమతులు లేకుండానే పెట్టుబడులు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు ప్రకారం, మింత్రా తన ఉత్పత్తులను ఎక్కువగా వెక్టర్ ఈ-కామర్స్ అనే కంపెనీకి అమ్ముతోంది. ఈ వెక్టర్ కూడా మింత్రాకి చెందినదే. తర్వాత వెక్టర్ ఆ వస్తువులను కస్టమర్లకు నేరుగా అమ్ముతోంది.
ఇలా మింత్రా బిజినెస్‌ను రెండు భాగాలుగా మొదట B2B (బిజినెస్ టు బిజినెస్), తర్వాత B2C (బిజినెస్ టు కస్టమర్)గా చూపించి, అసలు రీటైల్ అమ్మకాలను హోల్‌సేల్ లావాదేవీల్లా మలిచేస్తోందని ED అంటోంది.
2010లో వచ్చిన ఎఫ్డీఐ(FDI) నిబంధనల ప్రకారం, హోల్‌సేల్ వ్యాపారం చేసే కంపెనీలు గరిష్ఠంగా 25% మాత్రమే తామకు సంబంధం ఉన్న కంపెనీలకు అమ్మాలి. కానీ మింత్రా ఈ పరిమితిని దాటేసి, ఎక్కువ శాతం వ్యాపారం తనదైన వెక్టర్ కంపెనీకే పంపిందని ఈడీ పేర్కొంది.
ఈ కేసు ఈ-కామర్స్ రంగానికి సంబంధించి మరిన్ని కఠిన నియంత్రణలు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మింత్రా తరపున ప్రతినిధులు స్పందిస్తూ, "మేము చట్టాలను గౌరవిస్తున్నాం. అధికారులు అడిగినంత సహకారం అందిస్తాం," అని తెలిపారు.
ఈ కేసు మింత్రాలో 2010 నుంచి 2015 మధ్య జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఉంది. ఆ సమయంలో సంస్థను నడిపిన స్థాపకులు ముకేష్ బాన్సల్, అశుతోష్ లావానియా వంటి వ్యక్తులపై కూడా దర్యాప్తు సాగే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఘటన, భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై నియంత్రణలు మరింత గట్టిగా అమలవుతాయనే సూచనగా పరిగణిస్తున్నారు.ఈడీ దర్యాప్తు చూస్తుంటే, మింత్రా మీద కోట్ల రూపాయల విలువైన విదేశీ పెట్టుబడుల (FDI) ఉల్లంఘనలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications