ఆర్థిక పరిస్థితి చాలా దారుణం, 3 రోజుల్లో గుడ్‌న్యూస్!: గడ్కరీ, తెలంగాణవారితో ఏమన్నారంటే
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి కకావికళమైంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలు ఎక్కాలంటే భారీ ప్యాకేజీ అవసరమని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాసముందని చెప్పారు. కేంద్రం రెండో ఆర్థిక ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తోందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అలా చేసినా పరిస్థితులు దారుణం
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని గడ్కరీ అన్నారు. ఈఎంఐ చెల్లింపులపై కేంద్ర బ్యాంకు మూడు నెలల పాటు మారటోరియం వెసులుబాటుకు అనుమతులు ఇచ్చినప్పటికీ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ పరిమితులను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.

అమెరికా, జపాన్ మెగా ప్యాకేజీలపై..
ప్రతి ఒక్కరిని ఎలా సంరక్షించాలనే అంశంపై అత్యున్నతస్థాయిలో తమ వంతు ప్రయత్నాలు తాము పూర్తిగా చేస్తున్నామని గడ్కరీ తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలు మెగా ప్యాకేజీలు ప్రకటించడంపై కూడా ఆయన స్పందించారు. ఆ దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అని, అందుకే భారీ ప్యాకేజీలు ప్రకటించాయని గుర్తు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల సమస్యలపై ఎప్పటికి అప్పుడు ప్రధాని మోడీతో పాటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఇండస్ట్రీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్
మరోవైపు, కేంద్రమంత్రి సోమవారం తెలంగాణ ఇండస్ట్రీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏ రకంగా ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ రీఫండ్ పేమెంట్స్‌ను వెంటనే బ్యాంకు అకౌంట్‌కు చెల్లింపులు చేయవచ్చునో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్యాకేజీ ప్రకటన ఉండవచ్చునని, దాని కోసం వేచి చూస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications