వచ్చే ఏప్రిల్ నుండి భారత ఆర్థిక వ్యవస్థ బౌన్స్ బ్యాక్, ఈ రంగాలపై తీవ్ర ప్రభావం
ఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పతనమైన భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వేగంగా పుంజుకుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ దినేష్ కుమార్ కారా అన్నారు. బెంగాల్ చాంపర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వర్చువల్ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 2021 నుండి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చునని, కొన్ని శాశ్వతంగా ఉంటాయన్నారు.

పెట్టుబడులకు కొంత సమయం
కరోనా సంక్షోభం ఎన్నో మార్పులను తీసుకు వచ్చిందని, ముఖ్యంగా ఆర్థిక సంస్థలు తమ ఖర్చులను అదుపు చేసుకోవడం నేర్చుకున్నాయని దినేష్ అన్నారు. ఈ మార్పులు చాలావరకు శాశ్వతంగా కొనసాగి ఆర్థిక వ్యవస్థ మరింత పరిణితి చెందేందుకు దోహదం చేస్తుందన్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడంలో ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును ప్రదర్శించిందన్నారు. జూన్ చివరి నుండి కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. కార్పొరేట్ రంగం నుంచి పెట్టుబడులకు డిమాండ్ పెరిగేందుకు కొంత సమయం పట్టవచ్చునని తెలిపారు.

కార్పోరేట్ రంగం జాగ్రత్తగా..
రుణాల పట్ల కార్పోరేట్ రంగం కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని దినేష్ అన్నారు. ఇటీవలి వరకు కుదైలన ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏటికి పుంజుకొని, బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరి నుంచి కొంత మేర సానుకూల సంకేతాలు కన్పించటమే కాకుండా ప్రస్తుత పతనం నుంచి వృద్ధి బాటలోకి పయనిస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన స్టీల్, సిమెంట్ వంటి విభాగాలు ఏప్రిల్ నుంచి ప్రోత్సాహకర పనితీరును కనబరచటమే కాకుండా ఎగుమతుల మార్కెట్టో పట్టును పెంచుకున్నాయన్నారు. మున్ముందు ఇతర రంగాలు కూడా వృద్ధి బాటలో సాగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు.

ఇవి బాగా దెబ్బతిన్నాయి
కరోనా కారణంగా ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలపై పెను ప్రభావం పడిందని దినేష్ అన్నారు. ఈ రంగాలు క్రమంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు, వాహనాల సేల్స్ వంటివి పెద్ద ఎత్తున పెరిగాయి. రికవరీలో వేగం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications