gold rates: బంగారం ధరల జోరు వెనుక అసలు గుట్టు ఇదే.. ఎకనామిక్ సర్వేలో షాకింగ్ నిజాలు!
కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే 2026.. ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల (gold rates) పై కీలక విశ్లేషణను అందించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరతకు బంగారం ధరలే నిదర్శనమని సర్వే పేర్కొంది. అలాగే ధరల పెరుగుదలకు గల కారణాలకు కూడా వివరించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని వివరించే ఎకనామిక్ సర్వే 2026.. ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న బంగార (gold), వెండి(silver) ధరలపై ప్రత్యేక దృష్టి సారించింది. బంగారం ధరలు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెరగడం అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితికి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు (Geopolitical Risks) అద్దం పడుతోందని సర్వే విశ్లేషించింది. పెట్టుబడిదారులు ఇప్పుడు సురక్షితమైన మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకే ఈ ఖరీదైన లోహాలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
సర్వే ప్రకారం 2025-26 కాలంలో బంగారం ధరలు పెరగడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి..
- డాలర్ బలహీనపడటం: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం వైపు మదుపుదారులు ఆకర్షితులవుతున్నారు.
- వడ్డీ రేట్లు: రియల్ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే బంగారం మేలని ప్రజలు భావిస్తున్నారు.
- గ్లోబల్ రిస్క్: రష్యా - ఉక్రెయిన్ లేదా మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ఆర్థిక మార్కెట్లలో భయాన్ని నింపుతోంది.
ద్రవ్యోల్బణం - బంగారం మధ్య సంబంధం
సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించేటప్పుడు బంగారం, వెండి ధరలను 'కోర్ ఇన్‌ఫ్లేషన్' (Core Inflation) నుంచి మినహాయిస్తారు. దీనికి కారణం ఈ లోహాల ధరలు దేశీయ డిమాండ్-సరఫరా కంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం దేశంలో కోర్ ఇన్‌ఫ్లేషన్ అదుపులోనే ఉన్నప్పటికీ, బంగారం ధరలు (gold rates) పెరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పెళుసుదనాన్ని సూచిస్తోందని సర్వే హెచ్చరించింది.
భారత్ ముందున్న సవాళ్లు.. పరిష్కారాలు..
ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు కేవలం లాభాల మీద కాకుండా భద్రత, రాజకీయ ప్రయోజనాల మీద నడుస్తోందని సర్వే అభిప్రాయపడింది. టారిఫ్ లు, ఆంక్షల వల్ల వాణిజ్యం క్లిష్టంగా మారుతోంది. ఈ క్రమంలో భారత్ కేవలం ఐటీ సేవలు లేదా విదేశాల నుంచి వచ్చే డబ్బు (Remittances) పైనే ఆధారపడకూడదని, సొంతంగా 'మాన్యుఫ్యాక్చరింగ్' (తయారీ రంగం) ఎగుమతులను బలోపేతం చేసుకోవాలని సూచించింది. అప్పుడే మన రూపాయి విలువ స్థిరంగా ఉంటుందని, గ్లోబల్ షాక్ ల నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది.
మొత్తానికి ఎకనామిక్ సర్వే 2026 ప్రకారం పెరుగుతున్న బంగారం ధరలు (gold rates) పెట్టుబడిదారులకు లాభాలను అందించవచ్చు. కానీ, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో వచ్చే ఆకస్మిక మార్పులను తట్టుకోవడానికి భారత్ తన ఎగుమతుల వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1న రాబోయే బడ్జెట్‌లో బంగారం దిగుమతి సుంకాలపై ఏవైనా కీలక నిర్ణయాలు ఉంటాయో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications