BharatPe: అష్నీర్ గ్రోవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. భారత్ పే ఏమని ఆరోపించిందంటే..
BharatPe: దేశంలో వేగంగా మార్కెట్లోకి చొచ్చుకొచ్చిన పేమెంట్స్ యాప్ భారత్ పే. అయితే ఈ కంపెనీని స్థాపించిన గ్రోవర్ కుటుంబం నాటకీయ కారణాలతో కంపెనీ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబంపై FIR నమోదైంది.
మోస, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో గ్రోవర్‌తో సహా ఐదుగురు కుటుంబ సభ్యులు రాడార్ కిందకు వచ్చారు. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, అతని అన్నదమ్ములు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది.

గ్రోవర్ 86 నకిలీ, తప్పుడు ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి నకిలీ మానవ వనరుల సలహాదారులకు గ్రోవర్, ఇతరులు రూ.7.6 కోట్ల మేర అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించబడింది. ఈ క్రమంలో సాక్ష్యాలను నాశనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని తెలుస్తోంది. EOW ఇప్పుడు నిందితులందరినీ అరెస్టు చేసే అధికారం కలిగి ఉంది.
గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్‌టెక్ యునికార్న్‌ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించబడింది. జనవరి 2022లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్ ను కంపెనీ మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేసింది. BharatPe ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసింది. రూ.67 కోట్లకు పైగా రికవరీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో.. డిసెంబర్ 2018లో బదిలీ చేసిన షేర్లను తిరిగి పొందాలని కొలాడియా గ్రోవర్‌పై దావా వేసింది.


Click it and Unblock the Notifications