లాక్ డౌన్ ఇలాగే ఎక్కువ కాలం కొనసాగిస్తూ వెళ్తే ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఓసారి ప్రకటన తర్వాత రెండుసార్లు పొడిగించారు. మూడోసారి పొడిగిస్తారేమోననే అనుమానాలు ఉన్నాయి. దీనిపై పారిశ్రామిక దిగ్గజం స్పందించారు. మార్చి 24న తొలిసారి లాక్ డౌన్ పైన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. తొలుత ఏప్రిల్ 14 వరకు ఉండగా ఆ తర్వాత మే 3 వరకు పొడిగించారు. అనంతరం మే 17వ తేదీ వరకు పొడిగించారు.

ఆత్మహత్యా సదృశ్యమయ్యే అవకాశం
లాక్ డౌన్‌ను మరింతకాలం పొడిగిస్తే దేశానికి ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమేనని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఎక్కువ కాలం పొడిగిస్తే రిస్క్ ఎక్కువ అన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజల ప్రాణాలు కాపాడుకోగలమని, కానీ ఇలాగే పొడిగిస్తూ వెళ్తే బడుగు వర్గాలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టుల సంఖ్య పెరుగుతుంటే కేసుల సంఖ్య పెరగడం సాధారణమని, కానీ దీర్ఘకాలం పొడిగిస్తే ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్క్ ఉందని, కరోనాతో కలిసి సహజీవనం చేయక తప్పదన్నారు. అదేం వీసాపై వచ్చిన పర్యాటకురాలు కాదన్నారు.

ప్రజల జీవితాలకు ఇది రోగ నిరోధక వ్యవస్థ లాంటిది
పనిచేస్తూ వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. ప్రజల జీవితాలకు రోగ నిరోధక వ్యవస్థ లాంటిది అవుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు. లాక్ డౌన్‌ను మరింత పొడిగించడమంటే ఆ వ్యవస్థను బలహీనపరచడమే అవుతుందన్నారు. అలా చేయడం మన సమాజంలోని అట్టడుగువర్గాల్ని ఎక్కువగా దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇండియా డెత్ రేటు 1.4 శాతం మాత్రమే ఉందన్నారు. అదే ప్రపంచ సగటు 35 శాతం, అమెరికాలో 228గా ఉందని గుర్తు చేశారు

నిపుణులదీ అదే మాట
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి కేంద్రం లాక్ డౌన్‌ను మరికొంతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా ఇదే సూచన చేస్తున్నారు. లాక్ డౌన్ ఎక్కువ కాలం కొనసాగించవద్దని, ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా పడిపోయింది. వ్యాపారాలు స్తంభించిపోయాయి.


Click it and Unblock the Notifications