చిన్నపాటి పట్టణాలు, నగరాల నుంచి మెట్రో సిటీల వరకు ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే ట్యాక్సీ, ఆటోలు లేదా క్యాబ్స్ బుక్ చేయడం అలవాటైపోయింది. అయితే ఈ ట్రెండ్ త్వరలోనే మారనుందని ఈజ్‌మైట్రిప్ అధినేత పేర్కొన్నారు.
ప్రస్తుతం రోడ్డు ప్రయాణానికి వినియోగిస్తున్న క్యాబ్స్ వినియోగం రానున్నరోజుల్లో భారీగా తగ్గుతుందని ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకులు ప్రశాంత్ పిట్టి అంచనా వేశారు. మరో పదేళ్లలో వాటి స్థానాన్ని ఎయిర్ ట్యాక్సీలు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే భారతీయ ప్రయాణీకులు ఇంట్రా-సిటీ జర్నీ కోసం వీటిని వినియోగిస్తారని తేల్చి చెప్పారు.

ట్రాఫిక్ సమస్యల మాటే లేకుండా గగనతలం సమృద్ధిగా అందుబాటులో ఉన్నట్లు పిట్టి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విమానయాన సంస్థలు తప్ప ఎవ్వరూ దాన్ని వినియోగించుకోవడం లేదన్నారు. వెయ్యి నుంచి 10 వేల అడుగుల మధ్య ఎత్తును ఉపయోగించుకోవడంలో అభ్యంతరం ఏమీ ఉండబోదన్నారు.
ఇప్పుడు వినియోగిస్తున్న క్యాబ్స్ కంటే ఎయిర్ ట్యాక్సీలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని పిట్టి తెలిపారు. ఆటోమేటిక్ విధానంలో పైలట్ అవసరం లేకుండా అవి ఆపరేట్ చేయబడతాయన్నారు. తన అంచనా ప్రకారం మరో ఐదేళ్లలో ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ దిశగా హ్యుండాయ్ ఇప్పటికే ఓ అడుగు ముందుకేసింది. అధునాతన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని అభివృద్ధి చేసింది. దీనికి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (eVTOL) ఎయిర్‌క్రాఫ్ట్ గా నామకరణం చేసింది. దీనికి నలుగురు ప్రయాణీకులను తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. సాలిడ్-స్టేట్ బ్యాటరీల ద్వారా శక్తిని పొందుతుంది.
భారతీయ చౌక ఎయిర్ లైనర్ ఇండిగో మాతృసంస్త ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ కూడా ఈ రంగంలో ప్రణాళికలు రచిస్తోంది. 2026 నాటికి భారతదేశం అంతటా ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఢిల్లీలోని కన్నాట్ నుంచి గురుగ్రామ్‌కు దూరం 60 కి.మీ కాగా రోడ్డు ప్రయాణానికి 90 నిమిషాల సమయం పడుతోంది. ఎయిర్ ట్యాక్సీ ద్వారా దాదాపు 7 నిమిషాల్లోనే ప్రయాణీకులను తీసుకెళ్లాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications