చాలామంది జీవితంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా బతుకుతుంటారు. వారికి ఇంకేమి పట్టవు.. జీవితంలో డబ్బు ఎంత సంపాదిస్తే అంత విలువ ఉంటుది అనుకుంటారు. ఇలా డబ్బు సంపాదించే సమయంలో ఏం కోల్పోతున్నారో తెలుసుకోలేకపోతున్నారు. డబ్బు బాగా సంపాదించాక వెనక్కి తిరిగి చూసుకుంటే వారు కోల్పోయిన జీవితం మొత్తం కనిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని ఓ యువ భారతీయ ఎంట్రప్రెన్యూర్ రెడ్డిట్ లో షేర్ చేసుకున్నారు.
నాకు డబ్బు ఉంది... కానీ సంతోషం లేదు అంటూ అతడు షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో అతడు ఓ ఫోటో, ఓ చిన్న బెడ్, సాదాసీదాగా కనిపించే గది షేర్ చేసి ఓ కోటి రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్న యువ విజయవంతమైన వ్యాపారి గది ఇదని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన రాకేష్ అనే యువకుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.ఇంటర్మీడియట్ తర్వాత స్కాలర్షిప్ సాయంతో చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) చదివాడు. 2020లో కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడటంతో సమయం లభించింది.

అయితే అంతకన్నా ముందు 2017లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి మొదటి వ్యాపారం స్టార్ట్ చేశాడు. అయితే అది ఫ్లాప్ కావడంతో మళ్లీ చదువు మీదకు దృష్టిని మరల్చాడు. 2020లో కరోనా సమయంలో Instagram ద్వారా ఓ సర్వీస్ బేస్డ్ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. పెట్టుబడి లేకుండానే చేసిన వ్యాపారం ద్వారా అతడు నెలకు రూ. 2 నుంచి మూడు లక్షలు సంపాదించాడు. తర్వాత అదే డబ్బును పెట్టుబడిగా పెట్టి డిజిటల్ మార్కెటింగ్, క్లయింట్ల డీలింగ్, డెలివరీ వంటివి చేశాడు. ఎక్కడా రూపాయి కూడా రుణం తీసుకోలేదు. లాభాలను తిరిగి బిజినెస్‌లో పెట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు దుబాయ్‌లో కూడా వ్యాపారం నడుపుతున్నాడు.
అతని తల్లిదండ్రులు సక్సెస్ అయిన కొడుకుని చూసి ఎంతో గర్వపడుతున్నారు. అయితే అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. నాకు సంవత్సరానికి కోటి రూపాయలు వస్తున్నాయి. కానీ సంతోషంగా లేను. రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదు. ఆఫీసులోనే 24 గంటలు ఉండాల్సి వస్తోంది. ఆలోచనలు ఆగడం లేదు. ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలనిపిస్తే అక్కడ కూడా ఫోన్ చూస్తూనే ఉండాలని అతడు రాసుకొచ్చాడు.
ఈ పోస్టు మీద నెటిజన్లు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కొందరు బిజినెస్‌ను వదిలేయ్ అని చెప్పగా మరికొందరు నీ లక్ష్యాల్ని కొత్తగా డిజైన్ చేసుకో మిగిలిన జీవితమైన ప్రశాతంగా జీవించు అని తెలిపారు. నువ్వు ఎన్నో కోట్లు సంపాదించావు, కానీ నీ హృదయంలో సంతోషం లేదు. అదే నిన్ను ఉన్నతుడిగా చూపిస్తుందని ఓ నెటిజన్ తెలిపాడు. ఒక్క రూపాయి రుణం లేకుండా, ఇంటర్నెట్ సాయంతో ఈ స్థాయికి వచ్చావంటే ఇది నిజంగా విజయానికి సంకేతమని మరొకరు చెప్పుకొచ్చారు.
ఈ కథ అతని ఒక్కరిదే కాదు.. డబ్బు కోసం పోటీ ప్రపంచంలో పరిగెడుతున్న ప్రతి ఒక్కరి కథ. సంపాదన కంటే సంతృప్తి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని ఈ కథ చెబుతోంది. డబ్బు సంపాదించిన వాడి కన్నా నిద్రపోయే ముందు ప్రశాంతంగా నవ్వగలిగిన వాడే నిజమైన విజేత అని పలువురు చెబుతున్నారు. డబ్బు, విజయం అవసరం కానీ, ఆత్మసంతృప్తి, ఆరోగ్యం, ప్రశాంతత అంతకంటే ముఖ్యమైనవి తెలుసుకోవాలని ఈ కథ అందరిని కదిలిస్తోంది.


Click it and Unblock the Notifications