Meesho IPO: ఈ-కామర్స్ కంపెనీ మీషో మెగా ప్లాన్.. ఐపీవో ప్రణాళికపై ప్రకటన..
Meesho IPO: ఈ-కామర్స్ రంగంలో దేశీయ సంస్థ మీషో వేగంగా ముందుకు సాగుతోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

స్టార్టప్ ఫండింగ్..
ఫండింగ్ వింటర్ కారణంగా దేశంలోని స్టార్టప్ కంపెనీలు ప్రస్తుతం ఫండింగ్ క్రంచ్ ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో మీషో చివరగా నిధుల సేకరణ దాదాపు 15 నెలల క్రితం సెప్టెంబర్ 2021లో నిర్వహించింది. అప్పట్లో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, B క్యాపిటల్ గ్రూప్ నేతృత్వంలో 570 మిలియన్ డాలర్లు సిరీస్ F రౌండ్‌ను సేకరించింది. దీనికి ఆరునెలల ముందు సిరీస్ E రౌండ్ కింద సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ నేతృత్వంలో 300 మిలియన్ డాలర్లను సేకరించింది.

డబ్బుల తిప్పలు..
ఫండింగ్ శీతాకాలం మధ్య బెంగళూరుకు చెందిన మీషో తన తదుపరి రౌండ్ నిధుల సమీకరణ కోసం ముఖ్యంగా చివరి దశ డీల్స్ విషయంలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మీషో ఒక రౌండ్ నిధుల కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. 2021లో తమకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బును సేకరించటం తమ అదృష్టమని ఆయన వెల్లడించారు. కావాల్సిన దానికంటే ఎక్కువ నిధులు బ్యాంకుల్లో ఉన్నాయని.. వాటితో వ్యాపారాన్ని ఆరోగ్యకరంగా నిర్వహించగలమని స్పష్టం చేశారు.

ఐపీవోపై స్పష్టత..
రానున్న కాలంలో తదుపరి రౌండ్ నిధులను ఐపీవో రూపంలో ఈక్విటీ మార్కెట్ నుంచి సేకరించే అవకాశం ఉందని ఆత్రే అన్నారు. అయితే వీలైనంత త్వరగా లాభాయకత సాధించాలనేది కంపెనీకి 2023లో ఉన్న లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇది జరిగితే బయటి నుంచి నిధులను సేకరించాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.

నిధుల సేకరణ..
ఈ-కామర్స్ స్టార్టప్ మీషో దేశీయ, గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి అత్యధికంగా ఒక బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్‌ను సేకరించిన స్టార్టప్‌లలో ఒకటిగా ఉంది. ఆగస్టు 2019- సెప్టెంబరు 2021 మధ్య కాలంలో కంపెనీ విలువ 700 మిలియన్ డాలర్ల నుంచి 4.9 బిలియన్లకు చేరుకుంది. అయితే కంపెనీ ప్రస్తుతం లాభదాయకంగా మారినవెంటనే ఐపీవోకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. రానున్న కొన్ని నెలల్లోనే కంపెనీ లాభదాయకమైనదిగా మారుతుందని యాజమాన్యం ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications