Flipkart UPI: దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా ఫోన్ పే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిలో మెజారిటీ వాటాలను వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
భారతదేశంలో అద్భుతమైన విజయాన్ని సాధించిన యూపీఐ చెల్లింపుల సేవల వ్యాపారంలోకి తాజాగా ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అడుగుపెడుతోంది. థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో కంపెనీ తన యాప్ లోపల, బయట డిజిటల్ చెల్లింపులను అందించేందుకు సిద్ధమౌతోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సేవను అందుబాటులోకి తెచ్చింది.

తాజా చర్య వల్ల కంపెనీ వద్ద ఉన్న కస్టమర్లకు తోడుగా డిజిటల్ చెల్లింపులను వినియోగించుకుంటున్న దేశంలోని 50 కోట్ల మంది వినియోగదారులను, విక్రేతలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోటీదారుగా ఉన్న అమెజాన్ యూపీఐ చెల్లింపుల వ్యాపారంలో ఉన్న సంగతి తెలిసిందే. పేటీఎం క్రైసిస్ తర్వాత ఫోన్ పే, గూగుల్ పేలతో పోటీ పడేందుకు సరైన సమయంలో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇకపై కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో కొత్తగా UPI IDని సృష్టించి.. వ్యాపారులతో పాటు వ్యక్తులకు సైతం చెల్లింపులు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
దీనికోసం కంపెనీ యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అయితే యూపీఐ చెల్లింపు సేవలను మెుదటగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభించబడిన యూపీఐ చెల్లింపుల సేవలు.. త్వరలోనే మైంత్రా, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్+, క్లియర్‌ట్రిప్‌తో సహా ఇతర ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీల్లోకి విస్తరించబడుతుందని కంపెనీ ప్రకటించింది.
ఇటీవలి కాలంలో దేశంలోని ఈ కామర్స్ సంస్థలు తమ కస్టమర్ల సౌలభ్యం కోసం సొంతంగా యూపీఐ చెల్లింపుల వ్యాపారంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఫుడ్ డెలివరీ మేజర్ జొమాటో తన UPI సేవను ప్రారంభించగా, ప్రత్యర్థులు అమెజాన్, టాటా న్యూ కొంతకాలంగా అదే ఆఫర్‌ను అందిస్తున్నాయి. అలాగే వాట్సాప్, మేక్ మై ట్రిప్ కంపెనీలు సైతం వాటి సొంత యూపీఐ చెల్లింపు హ్యాండిల్స్‌ను కలిగి ఉన్నాయి. ఫిబ్రవరిలో UPI లావాదేవీలు మొత్తం రూ.18.3 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications