Amazon Now: మరో 300 నగరాల్లో అమెజాన్ నౌ సేవలు.. త్వరలో ప్రారంభం..!
దేశంలో క్విక్ కామర్స్ వ్యాపారంలో పోటీ మరింత పెరగనుంది. అమెజాన్ తన క్విక్ కామర్స్ సేవలు అమెజాన్ నౌ 300 నగరాలకు విస్తరించేందుకు సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద క్విక్ కామర్స్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. నిమిషాల వ్యవధిలో డెలివరీ అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం క్విక్ కామర్స్ బిజినెస్ లో బ్లింకిట్, స్విగ్గీ, ఇన్ స్టా మార్ట్, జెప్టో ఉన్నాయి. వీటికి పోటీగా అమెజాన్ నౌ తన సేవలను మరింత విస్తరించనుంది. వినియోగదారులకు అత్యధిక రకాల ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వివరించింది.
అమెజాన్ నౌ సీఈఓ ఆండీ జెస్సీ భారత్ పర్యటనలో భాగంగా ఫుల్‌ఫిల్‌మెంట్ మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇండియాలో కంపెనీ సేవలను వేగంగా విస్తరిస్తామని అన్నారు. కాగా ప్రస్తుతం అమెజాన్ నౌ సేవలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణెతో పాటు మొత్తం 15 నగరాల్లో కొనసాగుతోన్నాయి. ఇప్పుడు 300 నగరాలకు సేవలు విస్తరించనున్నారు. అమెజాన్ నౌ కు ప్రైమ్ మెంబర్స్ నుంచి మంచి స్పందన ఉందని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ అన్నారు.డిమాండ్ 3 రెట్లు పెరిగినట్లు వివరించారు.

వ్యాపార విస్తరణ, ఏఐ-ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతులు, ఉద్యోగ కల్పనకు మద్దతుగా ఇప్పటికే పెట్టిన 40 బిలియన్ డాలర్లకు అదనంగా, 2030 నాటికి 35 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. కిరాణా సామాగ్రి, షాంపూ, శిశు ఉత్పత్తుల వంటి తక్షణమే అవసరమయ్యే వస్తువులు, ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాలకే పికప్ చేయబడి డెలివరీ చేస్తామన్నారు.
అమెజాన్ నౌ ప్రస్తుతం 50 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అమెజాన్ నౌ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. అమెజాన్ ఫుడ్ డెలివరీ లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఫుడ్ డెలివరీలోకి వస్తే జొమాటో, స్విగ్గీకి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications