elections business: దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా మొదలైంది. నోటిఫికేషన్ వెలువడటంతోనే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. అయితే భూమి మీద జరిగే ప్రతి ఈవెంట్‌ను వ్యాపార కోణంలో చూసే ఇ-కామర్స్ సంస్థలు తమ బిజినెస్ ప్రారంభించాయి. రాజకీయ పార్టీల పుణ్యమా అని పెద్ద మొత్తంలో రెవెన్యూ జనరేట్ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నాయి.
భారత ఇ-కామర్స్ రంగంలోనూ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన పలు వస్తువులు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. BJPకి సంబంధించిన కమలం గుర్తులు, పాతకాలపు సముద్ర గడియారాలపై ఆప్ పార్టీ లోగో, కాంగ్రెస్ కండువాలు సహా వివిధ పార్టీలకు సంబంధించిన జెండాలు, నేతల ఫొటోలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్ సెర్చ్ బార్‌లో కేవలం రాజకీయ పార్టీ పేరు ఎంటర్ చేస్తే చాలు, జెండాల నుంచి పెండెంట్‌లు, పెన్నుల వరకు పలు రకాల ఉత్పత్తులు దర్శనమిస్తున్నాయి. 2019 నుంచి ఈ ధోరణి ప్రారంభమైనట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రతిదీ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నప్పుడు వీటిని మాత్రం ఎందుకు మినహాయించాలని భావించినట్లు పేర్కొంటున్నారు.
టీ-షర్టులు, మగ్‌లు, నోట్‌బుక్‌లు, బ్యాడ్జ్‌లు, రిస్ట్‌బ్యాండ్‌లు, కీచైన్‌లు, స్టిక్కర్లు, అయస్కాంతాలు, క్యాప్‌లు సహా అనేక రకాల ఉత్పత్తులు NaMo మర్చండైజ్ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. వీటితోపాటు 'మోదీ కా పరివార్','ఏక్ బార్, మోడీ సర్కార్', 'మోదీ కి గ్యారెంటీ' వంటి నినాదాలతో అలంకరించబడిన ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications