డ్రిల్ బేబీ డ్రిల్.. క్లీన్ ఎనర్జీ లీడర్‌గా భారత్.. భవిష్యత్తును నిర్ణయించనున్న బడ్జెట్ 2026
Budget 2026: ప్రపంచం మరోసారి శిలాజ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్న ఇటువంటి సమయంలో.. భారతదేశం మాత్రం వ్యతిరేక దిశలో సాగుతోంది. 2026 కేంద్ర బడ్జెట్ భారతదేశాన్ని కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కాకుండా.. ప్రపంచ క్లీన్ ఎనర్జీ నాయకుడిగా నిలబెట్టే కీలక మలుపుగా మారే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 'డ్రిల్, బేబీ, డ్రిల్' అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న వేళ.. భారత్ పునరుత్పాదక శక్తిపై తన నిబద్ధతను మరింత బలంగా చాటుతోంది.
ప్రపంచ పునరుత్పాదక ఇంధన రంగం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో క్లీన్ పవర్‌కు సంబంధించిన విధానాలు వెనక్కి వెళ్లాయి. యునైటెడ్ స్టేట్స్ 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగగా.. వాటిలో 12 సంస్థలు ఇంధనం, వాతావరణ మార్పు, పునరుత్పాదక శక్తికి సంబంధించినవే. భారతదేశం నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి (ISA) కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా క్లీన్ ఎనర్జీపై పన్ను ప్రోత్సాహకాలు తగ్గించడం, ప్రాజెక్ట్ అనుమతులను కఠినతరం చేయడం వల్ల అమెరికాలో పవన, సౌర ప్రాజెక్ట్ పైప్‌లైన్ తీవ్రంగా దెబ్బతింది. డెలాయిట్ అంచనాల ప్రకారం 2025 మొదటి అర్ధభాగంలో ఈ రంగంలో పెట్టుబడులు 18 శాతం తగ్గి దాదాపు 35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.

అయితే, ఇదే సమయంలో భారతదేశం చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025లో దేశ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం శిలాజేతర వనరుల నుంచే రావడం ప్రారంభమైంది. పారిస్ ఒప్పందం ప్రకారం ఈ లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకోవాలని మొదట భావించగా.. భారత్ ఐదేళ్లు ముందే దీనిని సాధించింది. ప్రస్తుతం దేశ మొత్తం విద్యుత్ సామర్థ్యం దాదాపు 510 గిగావాట్లుగా ఉండగా, అందులో సుమారు 262 GW శిలాజేతర వనరుల నుంచి వస్తోంది. ఇందులో 254 GW వరకు పునరుత్పాదక శక్తి వాటా ఉంది.
గత ఏడాది భారత్ దాదాపు 50 GW క్లీన్ పవర్‌ను జోడించింది. దీనికి సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. 2025 జనవరి నుంచి నవంబర్ మధ్యనే దాదాపు 45 GW కొత్త సామర్థ్యం చేరగా.. ఇందులో సుమారు 35 GW సౌర విద్యుత్ నుంచే వచ్చింది. భూసేకరణ సమస్యలు, రైట్-ఆఫ్-వే అనుమతులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల జాప్యాలు ఉన్నప్పటికీ, 2026లో కూడా ఇదే వేగం కొనసాగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
అయితే, ఈ వృద్ధికి అతిపెద్ద సవాలు ఫైనాన్సింగ్. 2030 నాటికి 500 GW శిలాజేతర సామర్థ్య లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2023-2030 మధ్య కాలంలో దాదాపు రూ.30.54 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. అని IREDA అంచనా. ప్రభుత్వ రంగ రుణదాతలు ఇప్పటికే రూ.10.79 లక్షల కోట్లను మోహరించినప్పటికీ.. ప్రైవేట్ పెట్టుబడులు మరింత వేగంగా రావాల్సిన అవసరం ఉంది.
గ్రాంట్ థోర్న్టన్ భారత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత్ భాటియా ప్రకారం.. పునరుత్పాదక రంగం కీలక దశలో ఉంది. 44 GW ప్రాజెక్టులు ఇప్పటికీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకుండా నిలిచిపోయాయి. ప్రసార మౌలిక సదుపాయాల కొరత వల్ల పీక్ అవర్స్‌లో 5 నుంచి 10 శాతం విద్యుత్ వృథా అవుతోంది. బ్యాటరీ నిల్వ సామర్థ్యం అవసరమైన 236 GWhకు గాను కేవలం 0.8 GWh మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు, 10 నుంచి 12 శాతం రుణ వ్యయాలు ప్రాజెక్టుల లాభదాయకతను దెబ్బతీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. పరిశ్రమ వర్గాలు బడ్జెట్ 2026 నుంచి బలమైన సంకేతాలను ఆశిస్తున్నాయి. మూలధన సబ్సిడీలు పెంచడం, PLI పథకాన్ని విస్తరించడం, బ్యాటరీ నిల్వకు పన్ను హేతుబద్ధీకరణ, తక్కువ వడ్డీ రుణాలు, భూమి క్లియరెన్స్‌లకు సింగిల్-విండో వ్యవస్థ వంటి చర్యలు కీలకమని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ 2026 ఈ అంశాల్లో సరైన దిశానిర్దేశం ఇస్తే, భారతదేశం క్లీన్ పవర్‌లో ప్రపంచ నాయకత్వాన్ని మరింత బలంగా సిమెంట్ చేసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.


Click it and Unblock the Notifications


