IT news: దేశీయ IT రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఎన్నడూ లేని విధంగా భారీ లాభాలను ఆర్జిస్తోంది. గతంతో పోలిస్తే సంపాదన ఎన్నో రెట్లు పెరిగింది. విదేశాల నుంచి భారీ ఎత్తున ఒప్పందాలు సాధిస్తోంది. అందుకు తగిన విధంగా నిరుద్యోగులకు కొలువులు కల్పిస్తోంది. మరి పెరిగిన ఆదాయానికి తగిన విధంగా ఫ్రెషర్లకు ఆయా సంస్థలు జీతాలు చెల్లిస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకమే. గత దశాబ్ధ కాలంలో IT కంపెనీల్లో ఉన్నత స్థాయి మేనేజ్ మెంట్ లోని సిబ్బందికీ, కొత్తగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు.. జీతాల పెరుగుదలలో తేడా ఎలా ఉందో చూద్దాం..

భారీగా పెరిగిన CEOల జీతాలు:
ఓ ప్రముఖ వెబ్ సైట్ విశ్లేషణ ప్రకారం.. దేశంలోని అతిపెద్ద IT కంపెనీల CEOల జీతాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. కానీ అదే సమయంలో ఫ్రెషర్ల జీతాల్లో అంతగా వృద్ధి కనిపించడం లేదు. 2012లో ఆ CEOల సగటు వార్షిక వేతనం రూ.3.37 కోట్లు కాగా.. అది 2022 నాటికి 835 శాతం పెరిగి రూ.31.5 కోట్లకు చేరుకుంది. కానీ ప్రెషర్ల వేతనాలు మాత్రం గత పదేళ్ల కాలంలో కేవలం 45శాతం వృద్ధితో రూ.2.45 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు మాత్రమే పెరిగాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్, ద్రవ్యోల్బణం ప్రభావం ఫ్రెషర్లపై ఏమాత్రం ఉండదని టెస్ట్ బుక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఈ విషయంపై వ్యంగ్యంగా స్పందించారు.

ఫ్రెషర్ కు రూపాయి, CEOకి 2111:
మే 26న 'ఐటీ బెల్ వెదర్ ఇన్ఫోసిస్' వార్షిక నివేదిక విడుదల అయింది. 2027 వరకు పదవిలో కొనసాగనున్న CEO సలీం ఫరెక్.. రూ.79.75 కోట్లు పరిహారం పొందుతున్నట్లు అందులో వెల్లడించింది. ఆయన జీతం గతంతో పోలిస్తే 88 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనతో అగ్రశ్రేణి కంపెనీ CEOల వేతనాలపై మార్కెట్లో చర్చ మొదలైంది. ఆయా కంపెనీల CEOలు, ఫ్రెషర్ల జీతాలను పోల్చి చూడగా.. ఇన్ఫోసిస్ 1973, విప్రో 2111, HCL 1020, L&T ఇన్ఫోటెక్ 676, టెక్ మహీంద్రా 644, TCS 619 నిష్పత్తి చొప్పున వేతనాల్లో వ్యత్యాసం ఉన్నట్లు టీంలీజ్స్ డిజిటల్ అనే సంస్థ వెల్లడించింది
కలవరపెడుతున్న అట్రిషన్ రేటు:
ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తున్నా, తీవ్ర అట్రిషన్ రేట్ తో IT పరిశ్రమ సతమతమవుతోంది. మిడ్ టు సీనియర్ స్థాయిల్లో 15-20 శాతంగా ఉన్న ఈ రేటు, జూనియర్ స్థాయిల్లో 30-35 శాతం వరకు ఉండటం కలవరపెడుతోంది. కేవలం సాధారణ సిబ్బందిలోనే కాక CEO స్థాయిలోని మేనేజ్ మెంట్ లోని ఉద్యోగులు సైతం కంపెనీ మారేందుకు, కొత్త స్టార్టప్ ని మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications