గుజరాత్ కేడర్ ఐఎఎస్, డీపీఐఐటీ కార్యదర్శి కన్నుమూత: మోడీకి అత్యంత ఆప్తుడిగా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి మరో అత్యున్నత స్థాయి అధికారిని పొట్టనబెట్టుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మొహపాత్ర కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతోన్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నెలన్నర రోజులుగా ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు.
1986 బ్యాచ్ గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి డాక్టర్ గురుప్రసాద్ మొహపాత్ర. ఆయన స్వరాష్ట్రం ఒడిశా. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పని చేసిన సమయంలో పలు కీలక హోదాల్లో పనిచేశారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడు, ఇష్టుడైన అధికారిగా గుర్తింపు పొందారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. వాణిజ్య శాఖ జాయింట్ కార్యదర్శిగా వ్యవహరించారు. స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ప్రమోషన్ బోర్డులో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం డీపీఐఐటీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

గురుప్రసాద్ మొహపాత్ర మృతి పట్ల ప్రధాని మోడీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ సంతాపం తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా డాక్టర్ గురుప్రసాద్‌తో తాను కలిసి పని చేశానని ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఇక లేరనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా.. కొత్త తరహా ఆలోచనలతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నారని చెప్పారు. గురుప్రసాద్ మరణంతో ఒడిశా ఓ నిజమైన యోధుడిని కోల్పోయిందని ధర్మేంద్ర ప్రధాన్ సంతాపం తెలిపారు. గురుప్రసాద్ మరణం కలచివేసిందంటూ పియూష్ గోయెల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications