గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ని వెంటాడుతున్న అతిపెద్ద భయం అమెరికా అధ్యక్షుడి సుంకాలు. ఆటోమొబైల్ దిగుమతులపై 25% సుంకం విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుంది. దింతో భారతీయ ఆటో కంపెనీలు కూడా ఈ ప్రభావం నుండి తప్పించుకోలేక పోయింది. భారతదేశం నుండి అమెరికాకు వాహనాల ఎగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రభావం ప్రపంచ సప్లయ్ చైన్ ద్వారా కనిపిస్తుంది.

దింతో టాటా మోటార్స్ షేర్లు నేడు భారీ క్షీణతలో ట్రేడవుతున్నాయి. బిఎస్‌ఇ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 6.31% తగ్గి రూ.661.35కి చేరుకున్నాయి. నిన్న రూ.707.95 వద్ద ముగియగా, నేడు రూ.673.95 వద్ద ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కారణంగా టాటా మోటార్స్ షేర్లు పడిపోయాయి. అమెరికా దిగుమతి చేసుకునే కార్లు, లైట్ వెట్ ట్రక్కులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ గతంలో అన్నారు. ఈ సుంకం వచ్చే వారం అంటే ఏప్రిల్ 2 నుండి అమల్లోకి వస్తుంది. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)కి అమెరికా పెద్ద మార్కెట్. JLR అన్యువల్ రిపోర్ట్ ప్రకారం, కంపెనీ మొత్తం అమ్మకాలలో 22% అమెరికా నుండి వస్తున్నాయి. మరోవైపు టాటా మోటార్స్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,179.05కి చేరుకున్నాయి.
గత ఏడాది కాలంలో చూస్తే టాటా మోటార్స్ షేర్ ధర 28.18% పడిపోయింది. కానీ గత మూడు సంవత్సరాలలో ఈ స్టాక్ 63.91% రిటర్న్స్ ఇచ్చింది. ఆటో విడిభాగాల తయారీ సంస్థ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్లు కూడా ఇవాళ భారీగా పడిపోయాయి. ట్రేడింగ్ సమయంలో 7% వరకు తగ్గి రూ.124.75కి చేరుకుంది. కానీ ఉదయం 10.00 గంటలకు బిఎస్ఇలో రూ.130.70 వద్ద ట్రేడైంది. గురువారం జపాన్‌లో కూడా ఆటోమొబైల్ కంపెనీల షేర్లు పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల అమ్మకందారి అయిన టయోటా షేర్లు దాదాపు 3.5% పడిపోయాయి. నిస్సాన్ షేర్లు 2.5%, హోండా షేర్లు 3.1% పడిపోయాయి. మిత్సుబిషి మోటార్స్ షేర్లు 4.5%, మాజ్డా షేర్లు 5.9%, సుబారు షేర్లు 6.1% పడిపోయాయి. దక్షిణ కొరియాలో హ్యుందాయ్ షేర్లు 2.7% పడిపోయాయి.
టాటా మోటార్స్ యాజమాన్యం ఒక సమావేశాన్ని నిర్వహించి JLR FY25 EBITDA లక్ష్యాన్ని సాధిస్తుందని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. కంపెనీ CFO మాట్లాడుతూ FY25లో కంపెనీ కనీసం 8.5% EBITDA మార్జిన్‌ను సాధిస్తుందని అన్నారు. అయితే, కొన్ని జాగ్వార్ మోడళ్లను నిలిపివేయడం వల్ల FY26లో JLR అమ్మకాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. అంతే కాకుండా, అమెరికా యూరప్‌పై సుంకాలు విధిస్తే, JLR ధరలు పెంచడం, ఖర్చులను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవలసి ఉంటుందని కూడా తెలిపారు. ఈ పరిణామాల మధ్య డోనాల్డ్ ట్రంప్ ఈ చర్య ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చు. దీనివల్ల ధరలు పెరుగుతాయని, ఉత్పత్తిలో సమస్యలు తలెత్తుతాయని ఆటో పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications