హార్ముజ్ జలసంధి వద్ద అసలేం జరుగుతోంది.. ఇరాన్‌పై మళ్లీ దాడులు.. ట్రంప్‌ను చంపిన వారికి రూ.560 కోట్లు బహుమతి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండు దేశాల మధ్య దాడులు తాత్కాలికంగా నిలిచినప్పటికీ, ప్రతిష్టంభన మాత్రం అలాగే కొనసాగుతోంది. వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇరాన్‌కు పరిమిత సమయం మాత్రమే ఇస్తున్నామని, ఈ లోగా ఒప్పందం కుదరకపోతే రాబోయే 2-3 రోజుల్లో లేదా వచ్చే వారం ఆరంభంలో భారీ స్థాయిలో దాడులు చేయడానికి సైన్యాన్ని సిద్ధం కావాలని ఆదేశించినట్లు తెలిపారు.
నిజానికి మంగళవారమే పెద్ద ఎత్తున దాడులు చేయాలని భావించినప్పటికీ.. అరబ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు, అలాగే ప్రస్తుతం చర్చలు జరుగుతుండటం వల్ల ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ప్రపంచాన్ని వినాశనం నుండి కాపాడటానికే తాను ఈ చర్యలు తీసుకుంటున్నానని, దీనికి ప్రజల మద్దతు ఉందని ట్రంప్ సమర్థించుకున్నారు. మరోవైపు Iran కూడా అమెరికా హెచ్చరికలపై గట్టిగానే స్పందించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మునుపటి స్థితికి వచ్చే ప్రసక్తే లేదని ఆ దేశ ఉన్నతస్థాయి చట్టసభ సభ్యుడు ఒకరు ప్రకటించారు. ఇరాన్ అనుమతి లేనిదే ఆ జలమార్గాన్ని తెరవడం ప్రపంచంలో ఏ శక్తికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గనుక మళ్లీ దాడులకు తెగబడితే.. తాము సరికొత్త వ్యూహాలతో, ఆధునిక సాధనాలతో ఎదురుదాడి చేస్తామని ఇరాన్ సైన్యాధికారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అక్రమీనియా హెచ్చరించారు. టెహ్రాన్‌లోని వాలియాస్ స్క్వేర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తమ సైన్యం ట్రిగ్గర్‌పై వేలు పెట్టి సిద్ధంగా ఉందని, తమ్ము ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.560 కోట్లు) బహుమతిగా ఇస్తామని అధికారికంగా ప్రకటించేందుకు వీలుగా 'ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య' అనే బిల్లును సిద్ధం చేస్తున్నారు. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ ఇబ్రహీమ్ అజీజ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. త్వరలోనే దీనిపై పార్లమెంటులో ఓటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. కాగా, యూఏఈలోని బరకాహ్ అణు విద్యుత్కేంద్రంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడులు ఇరాక్ భూభాగం నుండి జరిగాయని, దీని వెనుక ఇరాన్ మద్దతున్న షియా మిలీషియాలు ఉండి ఉంటాయని యూఏఈ రక్షణ శాఖ అనుమానిస్తోంది.
ఈ యుద్ధ వాతావరణం పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇటీవల ఇరాన్ ఆయిల్ రిఫైనరీపై జరిగిన దాడి కారణంగా పర్షియన్ గల్ఫ్‌లోని సముద్ర జలాల్లోకి చమురు భారీగా చేరింది. ఈ చమురు అలల ద్వారా జనావాసాలు లేని, వన్యప్రాణులు ఎక్కువగా ఉండే 'శిద్వార్' దీవికి కొట్టుకొచ్చింది. దీనివల్ల అక్కడి వన్యప్రాణుల మనుగడకు మరియు సముద్ర జీవుల ఉనికికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
