దశాబ్దాల నుంచి అవకాశాల పరంగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న అమెరికాలో తాజాగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లేవారి కంటే అమెరికా నుంచి ఇతర దేశాలకు వలస వెళుతున్న అమెరికన్ల సంఖ్య ఎక్కువవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికా పౌరులు స్వదేశాన్నీ వీడి ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ప్రముఖ దినపత్రిక Wall Street Journal దీనిపై సంచలన కథనాన్ని వెలువరించింది.
ఈ కథనం ప్రకారం.. దాదాపు 90 ఏళ్ల క్రితం మహా మాంద్యం సమయంలో కనిపించిన పరిస్థితులు ఇప్పుడు మళ్లీ అమెరికాలో పునరావృతమవుతున్నాయని స్పష్టం చేసింది.అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పుకు గణాంకాలే స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రముఖ థింక్‌ట్యాంక్ Brookings Institution అంచనాల ప్రకారం.. 2025లో అమెరికా నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య, దేశంలోకి వచ్చిన వలసదారుల కంటే ఎక్కువగా ఉంది. ఫలితంగా వలసల విషయంలో అమెరికాకు సుమారు 1.5 లక్షల మంది నికర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇది గత దశాబ్దాలుగా వలసలపై ఆధారపడి ఎదిగిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు.

గత కొన్ని సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 2023లో దాదాపు 60 లక్షల మంది అమెరికాకు వలస రాగా, 2025 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పడిపోయింది. మరోవైపు కేవలం 15 దేశాల పాక్షిక సమాచారం ప్రకారమే గత ఏడాది సుమారు 1.8 లక్షల మంది అమెరికన్లు ఆ దేశాలకు శాశ్వతంగా లేదా దీర్ఘకాల వసతి కోసం వలస వెళ్లినట్లు తెలుస్తోంది. అంటే వలసల ప్రవాహం అమెరికా వైపు కాకుండా బయటకు మళ్లినట్లు అర్థమవుతోంది.
ఈ వలసల వెల్లువకు కొందరు 'డొనాల్డ్ డాష్' అనే పేరు పెట్టినా.. దీనికి రాజకీయాలకన్నా విస్తృతమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల ధరలు, వైద్య ఖర్చులు మధ్యతరగతి కుటుంబాలను తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మరోవైపు రిమోట్ వర్క్ సంస్కృతి విస్తరించడంతో అమెరికాలో ఉండాల్సిన అవసరం తగ్గింది. యూరప్‌లోని జర్మనీ, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత లభిస్తున్నాయని అమెరికన్లు భావిస్తున్నారు.
జర్మనీకి వలస వెళ్లిన ఒక అమెరికన్ మాట్లాడుతూ..అమెరికాలో జీతాలు ఎక్కువైనా, ఇక్కడ జీవన నాణ్యత ఎంతో మెరుగ్గా ఉంది. అక్కడ పిల్లలను స్కూల్‌కు పంపితే భద్రతపై భయం వెంటాడుతుంది. ఇక్కడ అలాంటి ఆందోళన లేదని వ్యాఖ్యానించడం అమెరికా సమాజంలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది.
ఒకప్పుడు సాహసవంతులు లేదా అత్యంత విద్యావంతులు మాత్రమే దేశం విడిచి వెళ్లేవారని.. ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబాలు కూడా వలస బాట పడుతున్నాయని రిలొకేషన్ సంస్థలు చెబుతున్నాయి. పోర్చుగల్‌లో అమెరికన్ల సంఖ్య ఐదేళ్లలో 500 శాతం పెరగ్గా, ఐర్లాండ్‌లో గత ఏడాదిలోనే రెట్టింపు అయింది. అంతేకాదు అమెరికా పౌరసత్వాన్ని వదులుకునేందుకు దరఖాస్తు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.
అయితే ఈ అంశంపై White House భిన్నమైన స్పందన వ్యక్తం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే బలంగా ఉందని, అక్రమ వలసలను నియంత్రిస్తూనే, అత్యంత సంపన్నులను 'గోల్డ్ కార్డ్' వంటి పథకాలతో ఆకర్షిస్తున్నామని తెలిపింది.
ఏదేమైనా 1930లలో Great Depression సమయంలో ఉపాధి కోసం కొందరు Americans.. Soviet Union వైపు వలస వెళ్లిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ అమెరికా నుంచి నికర వలసలు నమోదవడం చరిత్రలో ఒక కీలక మలుపుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇది అమెరికా భవిష్యత్ సామాజిక, ఆర్థిక దిశపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.


Click it and Unblock the Notifications